ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారా..? బీజేపీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా వాణి వినిపించే విప్లవ రచయిత సంఘంకు ఈటల మద్దతుగా మాట్లాడటం దేనికి సంకేతం..? తెలంగాణలో హక్కులు అణచి వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న ఈటల.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అదే విధానం కొనసాగిస్తుందని చెప్పకనే చెప్పెస్తున్నారా..? ఆయన వ్యాఖ్యల పట్ల బీజేపీలో అంతర్మథనం ఎందుకు కొనసాగుతోంది..? ఇన్నాళ్ళు తనంతట తానే బీజేపీని వీడుతారనే అంచనాలు తప్పి, బీజేపీ సస్పెన్షనే ఈటల కోరుతున్నారా..?
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేస్తోన్న వ్యాఖ్యల మర్మం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన బీజేపీలో కొనసాగుతున్నా ఆయన ఆలోచనల స్వభావం మాత్రం విప్లవ భావజాలం వైపే ఉందని మరోమారు బయటపెట్టుకున్నారు. తాజా మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ… విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులు వరవరరావుకు మద్దతుగా మాట్లాడారు. భీమా కోరేగావు కేసులో వివిని జైలుపాలు చేసింది కేంద్రంలోని బీజేపీ సర్కార్. తెలంగాణలో హక్కుల అణచివేత కొనసాగుతుందని మాట్లాడిన ఈటల.. వివి అక్రమ నిర్బంధానికి కారకులెవరో ఆయనకు తెలియనిది కాదు. ఇది బీజేపీని ఇరుకున పెట్టాలని చెప్పారో..లేక పొరపాటులో మాట్లాడారో కాని ఆయన కామెంట్స్ పై వామపక్ష, ప్రగతిశీల సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
బీజేపీలో కొనసాగుతున్నా ఈటల తన భావజాలాన్ని ఇంకా మార్చుకోలేకపోతున్నారు. అదే సమయంలో బీజేపీ వ్యతిరేక శిబిరమైన ప్రగతిశీల వ్యక్తిగా ఆయన వ్యాఖ్యలు చేయడం బీజేపీకి మైనస్ గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సస్పెన్షన్ ను ఈటల కోరుకుంటున్నారా..? అనే చర్చ కూడా జరుగుతోంది. తనంతట తానుగా బీజేపీని వీడితే అందరిలాగే జంప్ జిలాని క్యాండిడేట్ గా ముద్ర మోయాల్సి వస్తోంది.దీని దృష్టిలో ఉంచుకొని ఈటల అటువైపు నుంచి నరుక్కోస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.