బీజేపీ, టీఆర్ఎస్ నేతల డైరక్షన్ లోనే ఆ పార్టీ కార్యకర్తలు చండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టాలనే దుర్బుద్ధితోనే ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చుననే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పే వాదనలో నిజమెంత ఉందొ చెప్పలేం కాని, జరుగుతోన్న పరిణామాలను గమనిస్తుంటే మాత్రం వారి ఆరోపణలను అంతగా ఈజీగా కొట్టిపారేయలేమని అంటున్నారు రాజకీయ పండితులు.
రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన కొన్ని క్షణాల వ్యవధిలోనే ఉప ఎన్నికకు తాము సిద్దంగా ఉన్నామని, రెండు రోజుల గ్యాప్ లోనే మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యర్ధి పార్టీలకు కాంగ్రెస్ హెచ్చరికలు పంపింది. అలాగే , ప్రతి మండలానికో ఇంచార్జ్ ను నియమించి ప్రచారంలో కాంగ్రెస్ ముందుండేలా కార్యాచరణ తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీల కంటె ముందుగానే అభ్యర్థిని ప్రకటించి బీజేపీ, టీఆర్ఎస్ లకు తమ ఉద్దేశ్యాన్ని చాటిచెప్పింది కాంగ్రెస్. హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు తమ పార్టీలోకి వస్తారని బోలెడు ఆశలు పెట్టుకున్న బీజేపీ , టీఆర్ఎస్ లకు రేవంత్ తనదైన శైలిలో చక్రం తిప్పి ఝలక్ ఇచ్చారు. వారంతా ప్రచార పర్వంలో పాల్వాయి స్రవంతికి సహకరిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెకు స్థానిక నేతల నుంచి , రాష్ట్ర నాయకత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుండటంతో టీఆర్ఎస్ , బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే కాంగ్రెస్ ను ప్రచారపర్వంలో వెనక్కి లాగేందుకే హస్తం పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టి ఉండొచ్చునని చెబుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడును నిలువరించాలంటే ఎం చేయాలన్న దానిపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్, బీజేపీలు పశ్చిమ బెంగాల్ లో జరిగిన పరిణామాలను తెలంగాణపై రుద్దుతున్నారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ అధినాయకత్వం వేసిన ఈ కుట్రకు టీఆర్ఎస్ నుంచి కూడా సహకారం అందిందని..రెండు పార్టీల సారధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టె కుట్ర రచన జరిగి ఉండొచ్చునని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక గనుక గెలిస్తే అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం తథ్యం. కాబట్టి, ఉమ్మడి ప్రయోజనంలో భాగంగానే చండూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారని.. తద్వారా కాంగ్రెస్ ను ప్రచారంలో వెనకబడేలా చేసేందుకు అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీల ఆలోచనట. ఈ దుశ్చర్యలో రెండు పార్టీలకు ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు మెల్లగా కొనసాగుతుందని.. ఇంకా నిందితులను పట్టుకోలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ కుట్రలను చేదించి కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తే రానున్న రోజుల్లో టీఆరెస్, బీజేపీల కుట్ర రాజకీయాలు ఎలా ఉండనున్నాయో ఊహించుకోవాలంటేనే భయమేస్తోందని చెప్పుకొస్తున్నారు.