కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ప్రాపకాన్ని కోల్పోయారు. నూతనంగా ప్రకటించిన టిపిసిసి కమిటీలో ఎందులోనూ ఆయనకు అవకాశం కల్పించలేదు. దీంతో అనధికారికంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవలు ఇక చాలు అనే సంకేతాలు పార్టీ హైకమాండ్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని ఓ ఆట ఆడుకున్నారు. పార్టీని ఎంత వీక్ చేయాలో చేతనైనంత చేసేశారు. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే. ఏం మాట్లాడిన మమ్మల్ని పార్టీ సస్పెండ్ చేయదనుకొని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. పార్టీకి నష్టం కల్గించే విధంగా వ్యవహరించారు. మునుగోడు ఉప ఎన్నికతో పార్టీ పీక నొక్కాలని ప్రయత్నాలు చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ…ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీలోకి వెళ్తానన్నది ప్రకటిస్తానని చెప్పడంతో ఆయన్ను అధిష్టానం లైట్ తీసుకున్నట్లు ఉంది.
మునుగోడు బైపోల్ సమయంలో బీజేపీ కి ఓటేయలంటూ స్వయంగా వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ లో మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మొదటి సారి నోటీసులు అందలేదని చెప్పినా ఆయన రెండోసారి మాత్రం వివరణ ఇచ్చారు. అఫిషియల్ గా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హైకమాండ్ ప్రకటించిన టీ పీసీసీ జంబో లిస్ట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు పరిశీలనలో తీసుకోకపోవడంతో ఆయనతో కాంగ్రెస్ కు పని లేదని చెప్పినట్లైంది.