ఎంపీటీసీ స్థాయి వ్యక్తి అయినా సరే తన ప్రత్యర్ధినో, లేదా తనతో విభేధించే వ్యక్తి కనిపిస్తే అధికార దర్పం ప్రదర్శిస్తారు. పదవులు రాగానే తనకంటే సీనియర్లను కూడా లెక్క చేయరు. రాజకీయాల్లో సీనియారిటీ కంటే పదవులకే పవర్ ఎక్కువ కాబట్టి ఇది సాధారణమే. మరి సీఎం స్థాయి వ్యక్తికి ఎంత పవర్ ఉంటుంది. ఆయన తలచుకుంటే తనతో విభేదించే ఎమ్మెల్యేను ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు. కావాలంటే ముప్పుతిప్పలు పెట్టొచ్చు. కానీ రేవంత్ రెడ్డి స్టయిలే వేరు. అందరినీ కలుపుకొని వెళ్లడమే ఆయన సక్సెస్ మంత్రా. వ్యక్తిగతంగా తనతో ఎంత విభేధించే నాయకుడు అయినా సరే..కలుపుకొని వెళ్లేందుకే ప్రయత్నిస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులను వరించని ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కింది. గత ఎన్నికల ముందు బేషజాలకు వెళ్లకుండా అందరినీ కలుపుకొని వెళ్లి పార్టీని విజయతీరాలకు చేర్చాడు.
ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసిన సందర్భంలో మరోసారి రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తిత్తత్వంపై చర్చ జరుగుతుంది. దొంతి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ..ఆయన ప్రవర్తన తీరు కాస్త డిఫరెంట్. రేవంత్ రెడ్డి కంటే తాను పార్టీలో సీనియర్‌ను అన్న ధోరణి ప్రదర్శిస్తారన్నది స్థానికంగా టాక్. అంతేకాదు ఎన్నికల ప్రచారం సమయంలో రేవంత్ రెడ్డిని తన నియోజకవర్గంలోకి రావొద్దని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్తారు. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్రను కూడా నర్సంపేట నియోజకవర్గంలోకి రావొద్దని అప్పట్లో చెప్పారట. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని వరంగల్ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇదంతా బహిరంగంగా జరిగే చర్చ కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇప్పుడాయన సీఎం హోదాలో ఉన్నారు. కావాలంటే దొంతిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అలా చేయలేదు. పదవి వచ్చే ముందు ఎలా ఉన్నారో…ఇప్పుడూ అలాగే ఉన్నారు. అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. తనతో విభేదించినప్పటికీ…రాజకీయ పరిణతి ప్రదర్శించారు. ఇక్కడే ఆయన వ్యక్తిత్వం పరంగా, రాజకీయంగా మరో మెట్టు ఎక్కారు.
తాజాగా దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి చనిపోవడంతో వరంగల్‌లో జరిగిన మాతృయజ్ఞంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నిజానికి దొంతితో రేవంత్ రెడ్డి కలిసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈ కార్యక్రమంలో రేవంత్, దొంతి మధ్య సాన్నిహిత్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దొంతిని చాలా ఆప్యాయంగా పలకరించారు రేవంత్ రెడ్డి. తనతో విభేదించిన వ్యక్తితోనూ ఏ మాత్రం దర్పం ప్రదర్శించకుండా వ్యవహరించారు.
సీఎం కాకముందు ఎలా ఉన్నారో…పదవి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ బాధ్యతాయుతంగా, మరింత కలుపుగోలుగా ఉండటం కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం కావొచ్చు. చిన్న పదవి వస్తేనే తనను మించిన వారు లేరనుకునే నాయకులు ఉన్న ఈ రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి లాంటి అరుదైన, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అందుకే కావొచ్చు ఆయన తక్కువ సమయంలోనే అనేక విజయాలను సాధిస్తున్నారు.