టీఆర్ఎస్ పేరు మార్పుపై టీపీసీసీ నేత చలమల్ల కృష్ణారెడ్డి స్పందించారు. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణతో ఆ పార్టీకున్న అనుబంధాన్ని తెంచేసుకున్నట్టేనని తెలిపారు. తెలంగాణకు టీఆరెస్ శ్రీరామ రక్షా అని ప్రతి వేదికపై మాట్లాడిన కేసీఆర్ , కేటీఆర్ లు ఇప్పుడు జనాలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయ అవసరాల కోసమే పార్టీ పేరును మార్చారని పేర్కొన్నారు. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్లు.. పార్టీ పేరు మార్చగానే టీఆరెస్ నేతలు అప్పుడే జాతీయ పార్టీ అయినట్లుగా భ్రమ పడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని..దాంతోనే ఆయన రాజకీయ నిష్క్రమణ జాతీయ రాజకీయాల వలన జరిగిందనే ఓ అభూత కల్పనను క్రియేట్ చేసేలా బీఆర్ఎస్ ను ముందుకు తీసుకొచ్చారన్నారు చలమల్ల కృష్ణారెడ్డి. కేసీఆర్ కు దమ్ముంటే టీఆరెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి బీఆర్ఎస్ పై పోటీ చేయించాలని సవాల్ విసిరారు. తెలంగాణను సంక్షోభంలోకి నెట్టేసి తెలంగాణ మోడల్ అంటూ మాట్లాడటం అవివేకమని తూర్పారబట్టారు. బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని, బత్కాని రాష్ట్ర సమితి అని సెటైర్లు వేశారు.
గుజరాత్ మోడల్ తో దేశ ప్రజలను మోసం చేశారని మోడీనుద్దేశించి చలమల్ల కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పుడేమో, కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటూ దేశ ప్రజలను మోసం చేసేందుకు బీఆర్ఎస్ అంటూ కొత్త నాటకానికి తెర లేపారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలోనే కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించే పరిస్థితులు లేవని.. ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను కించపరించారని గుర్తు చేశారు. ఏపీలో పోటీచేస్తే అక్కడి ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.ఇక, టీఆరెస్, బీజేపీలకు మునుగోడులో డిపాజిట్ కూడా దక్కదని.. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయమని చలమల్ల ఆశాభావం వ్యక్తం చేశారు.