ఇండియాకు కూడా కరోనా ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం తన దృష్టిని భారత్ జోడో యాత్రపైకి మళ్ళించింది. వెంటనే భారత్ జోడో యాత్ర ఆపాలంటూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా లేఖ రాశారు. భారత్ జోడో యాత్రతో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ముగ్గురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అయితే, కరోనా నిబంధనలు కాంగ్రెస్ కు మాత్రమే వర్తిస్తాయా..? బీజేపీకి వర్తించవా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది.
కరోనా నివారణ దృష్ట్యా, దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కరోనా నిబంధనలను పాటించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబీకులకు ప్రాధాన్యత ఉంటుందని, కరోనా విషయంలో మాత్రం అందరికీ ఒకే విధమైన రూల్స్ వర్తిస్తాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలన్నారు.
అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేకే బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో అహ్మదాబాద్ లో మోడీ రోడ్ షో నిర్వహిస్తే అప్పుడు కరోనా నిబంధనలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
బీజేపీ చేపట్టిన జన ఆక్రోష్ ర్యాలీలకు జనం రావడం లేదని, భారత్ జోడో యాత్రకు మాత్రం జనం తండోపతండాలుగా వస్తున్నారనే అక్కసుతో భారత్ జోడో యాత్రను నిలుపుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.