కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. తన సూచనతో రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకుగాను అమిత్ షా ఈ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. షా ఆదేశాల మేరకు కేంద్ర నిఘా వర్గాలు మునుగోడు ఉప ఎన్నికపై ఇటీవల సర్వే నిర్వహించాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ తరుఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. కేంద్ర ఇంటలిజెన్స్ చేసిన సర్వేలో మాత్రం బీజేపీకి నిరశాజనకమైన ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవని గుర్తించింది. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు సర్వే ఫలితాన్ని అమిత్ షా టేబుల్ మీద ఉంచగా.. మునుగోడులో పార్టీ ఓటమి అంచున ఉండటం పట్ల షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మునుగోడులో కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్య థగ్ ఆఫ్ వార్ ఉండనుందని..టీఆర్ఎస్ ను వ్యతిరేకించే ఓటర్లను కాంగ్రెస్ ఆకర్షించడంలో సఫలం అయిందని.. దాంతో కాంగ్రెస్ బలపడుతుందని తేలింది. కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టడంలో బీజేపీ నేతలు విఫలం అయ్యారని.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని నమ్ముతున్నారని సర్వేలో తేలింది.
నిఘా వర్గాల నివేదిక ఆధారంగా బీజేపీ హైకమాండ్ అలర్ట్ అయింది. ఉప ఎన్నిక పోలింగ్ కు ఇంకాస్త సమయం ఉండటంతో ఈలోగా ప్రచారంలో దూకుడు పెంచాలని బీజేపీ అధినాయకత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈమేరకే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హుటాహుటిన ఢిల్లీకి రప్పించినట్లు తెలుస్తోంది.