సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైంది. సీబీఐ దర్యాప్తుకు ప్రత్యేక జీవోలు జారీ చేసి దర్యాప్తుపై కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటంతో..ఆ అంక్షలేవి సీబీఐకి వర్తించకుండా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.
ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం ప్రకారం సీబీఐ పని చేస్తున్నందున్న ఈ చట్ట సవరణ చేసి… సీబీఐపై ఆంక్షలు విధించిన రాష్ట్రాలకు షాక్ ఇవ్వనుంది కేంద్రం. వచ్చే నెలలో మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read : తెలంగాణలోకి ప్రవేశించిన ఫ్యాక్షన్ పాలిటిక్స్..!
సెంట్రల్ సర్కార్ పరిధిలోని దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందాలని కొన్ని రాష్ట్రాలు స్పెషల్ జీవోలు జారీ చేశాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, చత్తీస్ ఘడ్, మిజోరాం, మహారాష్ట్రల్లో దర్యాప్తు చేయాలంటే ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని సీబీఐ పొందాల్సి ఉంటుంది. తాజాగా ఆగస్ట్ 30న తెలంగాణ సర్కార్ సైతం సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. ఇలా తొమ్మిది రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తుపై ఆంక్షలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ విధానానికి ముగింపు పలకాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్ట సవరణ చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తేస్తోన్న జీవోలకు కాలం చెల్లినట్లే. ఈ చట్ట సవరణపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే అవకాశం ఉంది.
Also Read : కేసీఆర్ కు షాక్ – గజ్వేల్ లో ఈసారి ఎదురీతే..?
ఇప్పటికే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విపక్షాలు..ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్ట సవరణ చేస్తే రాష్ట్రాల అధికారాలకు కేంద్రం కోత విధిస్తుందని మరింత రచ్చ చేసే అవకాశం ఉంది.