పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా ఎలా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ వారం రోజులపాటు ఫామ్ హౌజ్ వేదికగా కసరత్తు చేశారు. కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి వరాల జల్లు కురిపించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా 500కోట్లు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, గ్రేటర్ చుట్టూ 400కి. మీ మేర మెట్రో విస్తరణ, వరంగల్ కు ఎయిర్ పోర్ట్ అంటూ ప్రకటించి ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ జరిగేలా చేసుకున్నారు. ఇవి ప్రభుత్వ వ్యతిరేకతను తుడిచేసి ప్రభుత్వానికి మేలు చేసేలా చేస్తాయని అనుకున్నారు.
తమొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లుగా కేసీఆర్ ఏదైతే ఆశించారో అది జరగడం లేదు. ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ మూడేళ్ళ కిందట చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. భూమండలం ఉన్నంతవరకు ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని గట్టిగా చెప్పేశారు. అసలు ఆర్టీసీ విలీనం చేయడం కుదరదని చెప్పి, ఆర్టీసీని విలీనం చేస్తే మిగతా కార్పోరేషన్లను విలీనం చేయాలనీ కోరితే ఎలా అంటూ అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఇదో ఎన్నికల స్టంట్ అనే వాదనలు వినిపించాయి.
ఇప్పుడు మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామమని ఎవరూ అడగకుండానే ప్రకటన చేశారు. అయితే, ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కానీ ఇలా చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని అక్కడి ఉద్యోగులకు స్పష్టత రావడంతో ఇక్కడి ఆర్టీసీ ఉద్యోగులు బయటకొచ్చి కేసీఆర్ కు పాలాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టలేదు. పైగా,ఆర్టీసీ ప్రభుత్వ పరమైతే ప్రభుత్వం చేతులో సంస్థ ఓ కీలుబొమ్మగా మారుతుంది. ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వపరం అవుతాయి, వాటిని అమ్మకానికి పెట్టిన పెడుతారని ఆందోళన చెందుతున్నారు.
ఇక హైదరాబాద్ చుట్టూ 400కి. మీ మేర మెట్రో నిర్మాణం చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనను కూడా పెద్దగా నమ్మడం లేదు. ఫ్లై ఓవర్లు కట్టడానికి ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటున్న సర్కార్…400కి. మీ మెట్రో విస్తరణను మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ లోపు పూర్తి చేస్తుందా..? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో ఆయా సెక్షన్ వారు రొడ్లకు మీదకు వచ్చి పాలాభిషేకాలు చేస్తారని అనుకుంటే…ఎవరూ ఆపని చేయడం లేదు. దాంతో కేటీఆర్ కేబినేట్ నిర్ణయాలను జనాల్లోకి తీసుకెళ్ళేలా చూడాలని బీఆర్ఎస్ శ్రేణులకు టాస్క్ ఇచ్చారు. కానీ జనాల నుంచి పెద్దగా ఆశించిన స్పందన రావడం లేదు.
Also Read : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వెనక పెద్ద స్టొరీ..!