ఎమ్మెల్సీ కవితను బీజేపీలోకి ఎవరు ఆహ్వానించారో బయటపెట్టాలని టీపీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ జరుపుతోన్న సిట్ , కవిత స్టేట్ మెంట్ ను కూడా తీసుకోవాలనడంతో ఇప్పుడు బీజేపీ , టీఆర్ఎస్ ఇరకాటంలో పడ్డాయి. ఇంతా జరిగాక కవితను సిట్ విచారించకపోతే ఇదంతా టీఆర్ఎస్ , బీజేపీ ఆడుతోన్న డ్రామా అనుకోవాల్సి వస్తుందని రేవంత్ చెప్పడంతో ఈ వ్యవహారంపై సిట్ చీఫ్ ఎం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కవితను బీజేపీ ఆహ్వానించడం కొంచెం అటు, ఇటుగా కొనుగోలు చేయడం లాంటిదేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తనను బీజేపీలో చేరమని ఆహ్వానించారని కవితే చెప్పడంతోపాటు ఇక్కడ షిండే మోడల్ అమలు చేయడంపై మాట్లాడరన్నారు. మహారాష్ట్రలో ఎలాగైతే ఎక్ నాథ్ షిండే..శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తనతోపాట వెంటబెట్టుకెళ్ళి.. శివసేన తనదేనని ప్రకటించుకున్నట్లుగా. టీఆర్ఎస్ లోనూ కవిత అలాంటి రోల్ పోషించడం అన్నట్లు.
రేవంత్ రెడ్డి ఇవే అంశాలను ప్రస్తావిస్తూ… కవితను షిండేగా మార్చి రాజకీయం చేయాలని ఎవరనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు ఎరవేత కేసులో విచారణ జరుపుతోన్న సిట్.. పనిలో పనిగా కవిత స్టేట్ మెంట్ ను సైతం రికార్డ్ చేయాలనీ డిమాండ్ చేశారు. బీజేపీపై యుద్దమేనని ప్రకటిస్తోన్న కేసీఆర్.. ఈ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి సిట్ తో కవిత స్టేట్ మెంట్ ను నమోదు చేసి ఆసలు విషయాలను బయటపెడితే బీజేపీని దోషిగా బోనులో ఎక్కించిన వారు అవుతారు. కాని కేసీఆర్ ఎందుకీ సాహసం చేయడం లేదన్నది అందరి ప్రశ్న.
దీనిని పసిగట్టిన రేవంత్ రెడ్డి…ఇదంతా బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతోన్న నాటకమని తేల్చేశారు. ఇప్పటికి కూడా కవిత పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది స్పష్టం అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.