ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మూడేళ్ళ కిందట కార్మికులు కోరితే కుదరదని కేసీఆర్ చెప్పేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 50రోజులకు పైగా సాగుతుందని.. వారి డిమాండ్లను నెరవేర్చారా..? అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చారు కేసీఆర్. అలా ఎలా కుదురుతుంది..? అన్ని అంశాలను పరిశీలించే చెబుతున్నాం. ఆర్టీసీని విలీనం చేస్తామని దొంగ హామీలు ఇచ్చి…మోసం చేయడం మాకు తెలవదు అంటూ కేసీఆర్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం అసంభవం. సమ్మె విరమించి విధుల్లో చేరితే సరి. లేదంటే ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. కార్మికుల డిమాండ్ల పట్ల కేసీఆర్ కరుణించకపోవడంతో ఎంతోమంది కార్మికులు మనస్తాపంతో చనిపోయారు. మరెంతోమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆర్టీసీ కార్మికులను యూనియన్లే రెచ్చగోడుతున్నాయని యూనియన్లను లేకుండా చేశారు. కేసీఆర్ హెచ్చరికలతో సమ్మెను విరమించి కార్మికులు విధుల్లో చేరారు. ఆ తరువాత కార్మికుల పక్షానా గళమెత్తే వారె లేకుండా పోయారు.
సకాలంలో జీతాలు రాకపోయినా, బకాయిలు చెల్లించకపోయినా , పీఆర్సీ అమలు చేయకపోయినా, పీఎఫ్ డబ్బులు సకాలంలో ఇవ్వకపోయినా , అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నా ఆర్టీసీ కార్మికులు మౌనంగా భరిస్తున్నారు తప్పితే ఇదివరకులా సమ్మె చేపట్టడం లేదు. జీతాలు పెంచాలని కోరుతున్నారు అది కూడా అంతర్గంతంగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికలు సమీపిస్తున్నాయి. 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. అంటే రెండు లక్షల ఓట్లు. దాంతో ఈ ఓట్లు బీఆర్ఎస్ కు పడాలంటే ఆ వర్గాన్ని ఎలా ఆకర్షించాలని.. ఎవరూ అడక్కుండానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్టీసీ మొత్తాన్ని విలీనం చేయడం టెక్నికల్ గా సాధ్యం కాదు. కేవలం ఉద్యోగులను మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. ఎలా చేయాలి..? ఏమేం చేయాలన్న దానిపై ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆ సూచనలకు అనుగుణంగా అసెంబ్లీ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు.
ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అనడంలో సందేహం లేదు. మరోనాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తి అవుతుందా..? లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.
Also Read : ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు – హైకోర్టు సంచలన తీర్పు