మనసులో ఏం దాచుకోకుండా మాట్లాడేవారు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది బండ్ల గణేష్. ఆయన నోటి దురుసు కారణంగానే అప్పుడప్పుడు ట్రోలింగ్ కు గురవుతుంటారు. చిక్కుల్లో పడుతుంటారు. వాటిని కవర్ చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తాజాగా బండ్ల గణేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసి మళ్ళీ వార్తలోకెక్కారు.
పవర్ స్టార్ తో స్నేహం విషయంలో టాలీవుడ్ డైరక్టర్ త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ టార్గెట్ చేస్తున్నారు. తనను పవన్ కళ్యాణ్ దూరం పెట్టడానికి త్రివిక్రమే కారణమని ఆయన భావిస్తున్నట్టున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్-త్రివిక్రమ్ మధ్య విబేధాలు వెలుగుచూశాయి. బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్ నన్ను రాకుండా చేస్తున్నాడని అందులో ఆరోపించారు. ఈ ఆడియో కాల్ బయటకు లీకవ్వడం ఇండస్ట్రీలో దుమారం రేపింది.
అయితే, ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని ఎవరో తనను ఇరుకున పెట్టేందుకు అలా చేసి ఉంటారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఈ విషయమై స్పందిస్తూ.. ఆ ఆడియో తనదేనని.. ఎదో కోపంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. తరువాత త్రివిక్రమ్ ను కలిసి సారీ కూడా చెప్పాను. చిన్న విషయానికి మా మధ్య దూరం పెరుగుతుందా..? అంటూ గతంలో జరిగిన విషయాన్ని చిన్నది చేసి చూపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై సెటైర్లు వేశారు.
వాస్తవానికి రియల్ పవన్ కళ్యాణ్ ని బయటకు తీసిన వ్యక్తిని నేనే. ఆయన మామూలు మనిషి కాదు. పవర్ స్టార్ లో ఏదో అతీతమైన శక్తి ఉంది. ఈయన ఎక్కడో ఉండాల్సిన వాడని గుర్తించింది నేను. ఇప్పుడు గురూజీలు బరూజీలు వచ్చారు కాని, పవన్ కళ్యాణ్ గొప్ప తనాన్ని గుర్తించిన మొదటి వ్యక్తిని నేనని బండ్ల గణేష్ కామెంట్ చేశారు. ఇక్కడే బండ్ల గణేష్ త్రివిక్రమ్ ను టార్గెట్ చేసి దొరికిపోయాడు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ని గురూజీ అని పిలుస్తుంటారు. కాబట్టి బండ్ల గణేష్ గురూజీ అంటూ విమర్శించింది త్రివిక్రమ్ నే అని స్పష్టం అవుతుంది.