గుండెపోటుతో బెంగళూర్ నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా కుదుటపడనేలేదు. రెండు వారాల నుంచి ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో తారకరత్న కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తం అవుతుండగానే..నందమూరి ఫ్యామిలీలో మరో అపశృతి చోటు చేసుకుంది.
సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన రామకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి కారులో రామకృష్ణ వెళ్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ, కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. దీంతో ఆయన మరో వాహనంలో అక్కడి నుండి ఇంటికి వెళ్లారు.
నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైందని తెలుసుకొని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తరువాత ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రమాద సమయంలో కారును రామకృష్ణ డ్రైవ్ చేస్తుండటంతో.. తప్పు ఆయనదేనని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.
రోడ్డు ప్రమాదాల్లో నందమూరి కుటుంబానికి భయానక అనుభవాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, అన్నయ్య జానకి రామ్ రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.