కోడికత్తి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. ఈ కేసులో లోతైన విచారణ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈఘటన వెనక ఎలాంటి కుట్ర లేదు కాబట్టి పిటిషనర్ కోరుతున్నట్లు ఇంకా విచారణ అవసరం లేదని ఎన్ఐఏ వాదించింది. ఈమేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో నిందితుడిగానున్న శీను టీడీపీ సానుభూతిపరుడు కాదని అలాగే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ పోర్ట్ లోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ కు ఈ ఘటనతో సంబంధం లేదని తెలిపారు.
కోడికత్తి కేసు విషయంలో గత వాయిదాలో జగన్ తరుఫు న్యాయవాది రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కాకుండా జగన్ కు మినహాయింపు ఇవ్వడంతోపాటు లోతైన విచారణ అవసరమని ఈ విషయంలో ఎన్ఐఏ ఘోరంగా విఫలమైందని కనుక పూర్తిస్థాయిలో విచారణ జరిగేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరారు. కానీ ఈ కోడికత్తి ఘటనలో అసలు కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చింది. తాము పూర్తిస్థాయిలో విచారణ జరిపామని… ఈ కేసులో ఇంకా విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఎన్ఐఏ వాదనకు భిన్నంగా టీడీపీ వాదిస్తోంది. కోడికత్తి ఘటన వెనక కుట్ర ఉందని అంటోంది. జగన్ పై దాడిగా క్రియేట్ చేసుకొని ప్రజల్లో సానుభూతిని రగిల్చి ఎన్నికల్లో లబ్ది పొందారని కాబట్టి ఈ కేసులో కుట్ర కోణం ఉందని టీడీపీ బలంగా చెబుతోంది. ఈ కోణంలో విచారణ జరిగితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు. కానీ కోడికత్తి కేసును విచారణ చేస్తోన్న ఎన్ఐఏ అసలు కుట్ర లేదని అంటోంది. జగన్ ను చంపాలనే కుట్ర లేకపోయినా ఈ ఘటనను మాత్రం ఎన్నికల్లో వైసీపీ ప్రచారాస్త్రంగా వాడుకుంది.
కోడికత్తి ఘటనపై చార్జీషీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ. ఈ సమయంలోనే జగన్ పై కుట్ర కోణం వెలికి తీయడంలో ఎన్ఐఏ ఫెయిల్ అయిందని.. ఈమేరకు మరింత లోతైన విచారణ జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని జగన్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశం అయింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ స్పష్టం చేయడంతో జగన్ ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.