గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో రాష్ట్రంలో విజయం సాధించాయి. అయితే, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ గురుంచే. సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ హిమాచల్ ప్రదేశ్ లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో 40 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
గుజరాత్ లో మాత్రం కాంగ్రెస్ దారుణ పరాభవం ఎదురుచూసింది. ఆ పార్టీ ఓటు బ్యాంక్ ను ఆప్ చాలా వరకు దెబ్బతీసింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్ కు 27శాతం , ఆప్ కు 13శాతం ఓట్లు పడ్డాయి. ఆప్ ఖాతాలో పడిన 13శాతం ఓట్లు కాంగ్రెస్ ఓటు బ్యాంకే. ఇదే గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభావం చూపకపోవడానికి కారణమైంది. 53శాతం ఓటు బ్యాంక్ తో బీజేపీ గుజరాత్ లో సంపూర్ణ ఆధిక్యాన్ని కైవసం చేసుకొని ఏడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గతంలో ఇలాంటి ఘనత బెంగాల్ లో వామపక్షాలకు దక్కగా.. మరోసారి గుజరాత్ లో బీజేపీకి దక్కింది. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 154 బీజేపీకే దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 20స్థానాల్లో గెలుపొందింది.
Also Read : చెల్లి విషయంలో జగన్ సైలెంట్ – ఏమిటా సీక్రెట్..?
గుజరాత్ లో తీవ్ర ప్రభావం చూపుతుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు సీట్లను ఖాతాలో వేసుకుంది. ఇక, ఉప ఎన్నికలు జరిగిన చోట్ల బీజేపీకి ఆశాభంగమే ఎదురైంది. యూపీ మొయిన్ పురి లోక్‌సభతో పాటు అక్కడి రెండు అసెంబ్లీ స్థానాలు, ఒడిషా , చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ పార్టీ , యూపీలో ఎస్పీ, లోక్ దళ్, ఒడిషాలో బిజూ జనతాదళ్ విజయం సాధించాయి. గుజరాత్ లో ప్రభావం చూపినా బీజేపీ మిగిల చోట్ల మాత్రం తేలిపోయింది. గుజరాత్ ఎన్నిక ఫలితం బీజేపీకి ఆనందం కల్గించినా, హిమాచల్ ప్రదేశ్ , మిగతా చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కమలం వాడిపోవడం ఆ పార్టీని నిరాశ పరిచేదే.