కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య పోరాటంలో సిట్ వెనకబడిపోతుంది. ఈడీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. సిట్ మొదట్లో కాస్త దూకుడుగా వ్యవహరించినట్లుగా కనిపించిన తెలంగాణేతరులను రప్పించి ప్రశ్నించడంలో తేలిపోయింది. ఇద్దరిపై లుక్ అవుట్ నోటిసులు జారీ చేసినా వాటితో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. నోటిసులు ఇష్యూ చేసిన వెంటనే వారు కోర్టులకు వెళ్లి సిట్ పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తూ స్టే లు తెచ్చుకున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ నోటిసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటిసుల్లో పేర్కొంది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. తుషార్ కు కూడా సిట్ నోటిసులు ఇవ్వగా… నోటిసులపై సమాధానం ఇచ్చాక కూడా తనను ఇబ్బంది పెడుతున్నారని, ఈ కేసును సీబీఐకి బదలాయించాలని పిటిషన్ దాఖలు చేసిన తుషార్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు చెప్పింది.
హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన బలమైన ఆధారాలేవి లేవు. వారు ఫలానా చోట కలిశారని చెబుతున్నారే కాని , ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే మాట్లాడారని చెప్పేందుకు కావాల్సిన ఆధారాలను చూపించడం లేదు. ఖచ్చితంగా ఈ అంశంపైనే చర్చించేందుకే వారు కలిశారని చెప్పేందుకు ఆధారాలు లేకుండా ఈ కేసు కోర్టులో నిలవదు. వాట్సాప్ చాట్, కాల్ రికార్డ్ లను తెరపైకి తీసుకొస్తున్నారు. లొకేషన్లను సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. హైకోర్టుకు సమర్పించిన వాట్సప్ చాట్ లో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఆడియో సంబాషణలు ఉండటంతో వారందరిని విచారించాలని సిట్ కోరే అవకాశం ఉంది. దీంతో సిట్ విచారణ తీరు తెలిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది.
సిట్ పనితీరు ఇలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ మాత్రం దూకుడు కనబరుస్తోంది. ఏ చిన్న పాయింట్ ను వదలకుండా అన్ని ఆధారాలను సేకరిస్తోంది. నిందితుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు కూడా పేర్కొన్నారు. ఇందులో కవిత రెండు సిమ్ లు, పది ఫోన్లు వాడినట్లు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రారెడ్డి, కవితలే కీలకమని చెబుతున్నారు. త్వరలోనే కవితకు కూడా నోటిసులు అందనున్నాయి. ఈడీ దూకుడు స్పష్టంగా కనిపిస్తుండటంతో సిట్ విచారణ కూడా వేగవంతం చేయాలని ప్రయత్నిస్తోన్నా అది సాధ్యపడటం లేదు.