తెలంగాణ కాంగ్రెస్ ను ఎవరో వెనక్కి లాగాల్సిన పని లేదు. ఆ పార్టీ సీనియర్లే ప్రత్యర్ధి పార్టీలకు సహాయపడుతు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసికట్టుగా మార్చుతున్నారు. టి. కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారని వార్తలు రాగానే పోటీగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర పల్లవి అందుకున్నారు. భట్టి పాదయాత్ర రాగాల వెనక ఎవరో ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఆయన్ను ముందుంచి సీనియర్లు రేవంత్ పాదయాత్రకు అడ్డుపుల్లలు వేసేందుకు భట్టి పాదయాత్రను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో అధిష్టానం రేవంత్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలా..? లేదా అందరితో కలిసి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలా అనే దానిపై సమాలోచనలు చేస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ ను డీకొట్టాలంటే అంతటి వాక్చుతుర్యం, ఆ తేజస్సు, బలమైన వ్యూహాలను అమలు చేయగల నేర్పు కాంగ్రెస్ లో రేవంత్ ఒక్కడికే ఉంది. ఈ క్వాలిటీస్ కల్గిన రేవంత్ రెడ్డికి ప్రతిసారి సీనియర్లు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఆయన జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలియగానే రివర్స్ ఎటాక్ చేయడం సీనియర్లకు పరిపాటిగా మారింది. రేవంత్ కు పీసీసీ బాధ్యతలను చేపట్టాక పార్టీలో ఊపు వచ్చినా మళ్ళీ దానిని మునుపటి స్థితిలోకి తీసుకొచ్చేందుకు ఎంత కృషి చేయాలో అంత చేసేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉన్నారు.
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని అనుకున్నారు. ఇందుకోసం అధిష్టానం అనుమతి కోరారు. రేవంత్ కు ఎక్కడ అధిష్టానం అనుమతి ఇస్తుందో, తమకు ప్రాధాన్యత ఎక్కడ చెడుతుందోనని ఆందోళన చెందిన సీనియర్లు వెంటనే పాదయాత్రపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అసలు పాదయాత్ర కాదు చేయాల్సింది బస్సు యాత్రకు పర్మిషన్ ఇవ్వాలంటూ కోరారు. నేతలంతా ఒకేతాటిమీద ఉన్నారని చెప్పేందుకు బస్సు యాత్ర చేస్తే బాగుంటుందంటూ హైకమాండ్ ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
ఇన్ని ఇబ్బందులను దాటుకొని పార్టీని రేవంత్ చక్కద్దిదడం కత్తి మీద సాములాంటిదే. మరి సీనియర్ల అమలు చేస్తోన్న రివర్స్ ఎటాక్ ను ఎదుర్కొంటూ తన పాదయాత్ర పంతాన్ని ఎలా నెగ్గించుకుంటాడో చూడాలి.