పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీపై సర్కార్ జాప్యం, ధరణి పోర్టల్ లో అవకతవకలను నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు సమస్యలు, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కు గాలి అనిల్ కుమార్ అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
పోడు భూములకు పట్టాలిస్తామని, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన గాలి అనిల్, ఆ హమీ ఇచ్చి నాలుగేళ్ళు అవుతున్నా కేసీఆర్ ఇంకా నెరవేర్చలేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్ తో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నా ఆ దరిద్రాన్ని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో దళితులు, గిరిజనులకు పంపిణీ చేసిన భూములను కేసీఆర్ సర్కార్ తిరిగి లాక్కుంటుందని ఫైర్ అయ్యారు. ధరణిలో 24లక్షలు భూముల వివరాలు మాయం చేశారని.. ఆ వివరాలు ఎందుకు ధరణిలో లేవో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పేదలకు భూములు పంచితే వాటిని కేసిఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో మళ్ళీ భూస్వాములకు కట్టబెడుతుందని మండిపడ్డారు. పోడు రైతులకు పట్టాలివ్వకుండా జాప్యం చేయడంతోనే ఫారెస్ట్ అధికారి హత్యకు గురి అయ్యారంటూ ఆరోపించారు.
రైతులకు సకాలంలో రుణమాఫీ జరగాలన్న, పోడు రైతులకు పట్టాలు రావాలన్న కాంగ్రెస్ తోనే సాధ్యమని.. కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలు ఫామ్ హౌస్ కు శాశ్వతంగా పరిమితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, పోడు రైతులకు పట్టాలు, ధరణిని రద్దు చేస్తామని భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ప్రకటించారని గాలి అనిల్ కుమార్ తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ విధానమైతే.. వాటిని విస్మరించడం టీఆర్ఎస్ విధానమని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, ధరణి పోర్టల్ బాదితులు భారీగా పాల్గొన్నారు.