మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు తాను పార్టీ మారడం లేదనే ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది..? మునుగోడు ఉప ఎన్నిక ఫలితంనే పార్టీ మార్పుపై ఆయన వెనక్కి తగ్గారా..? బైపోల్ రిజల్ట్ మరోలా ఉండుంటే ఆయన కారు దిగేవారా..? టీఆర్ఎస్ అధిష్టానం ప్రాపకం కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలెట్టారా..? అనే అంశాలపై ఖమ్మం జిల్లా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
తుమ్మల నాగేశ్వర్ రావు..ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత. ఒకప్పుడు కనుసైగలతోనే జిల్లా రాజకీయాలను శాసించిన నాయకుడు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో తన క్యాబినెట్ లో తుమ్మలకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఆ తరువాత 2018 ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని అంత భావించారు. ఈ నేపథ్యంలోనే తుమ్మలను ఓడించిన కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ఎదో ఓ రోజు ప్రగతి భవన్ నుంచి పిలుపు రాకపోదా అనే ఆశతో ఎదురుచూపులు చూసిన తుమ్మలకు పలుమార్లు నిరాశే ఎదురైంది. పైగా , కందాల ఉపేందర్ రెడ్డి కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి నియోజకవర్గంలో తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. తనకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని కందాల ఉపేందర్ రెడ్డి ప్రకటనలు చేయడంతో, టీఆర్ఎస్ లో తుమ్మల కొనసాగడంపై డైలామాలో పడిపోయారు. అప్పుడే టికెట్ల లొల్లి షురూ చేసినప్పటికీ అధిష్టానం ఉపేందర్ రెడ్డిని మందలించకపోవడం పట్ల తుమ్మల మనస్తాపం చెందారు.
తుమ్మల అసంతృప్తిని గ్రహించిన బీజేపీ ఆయనతో టచ్ లోకి వెళ్ళింది. పూర్తి బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాలో బీజేపీ బలపడాలంటే తుమ్మల వంటి నేతలు అవసరమని ఆయనతో సంప్రదింపులు కూడా జరిపినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక తరువాత రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోవాలని భావించిన తుమ్మల.. మునుగోడు ఫలితం మరోలా ఉండటంతో పార్టీ మార్పుపై వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ఆయన పార్టీ మారుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో వాటికీ చెక్ పెట్టేందుకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తాను టీఆర్ఎస్ ను వీడనని ప్రకటించినట్టుగా తెలుస్తోంది.