సందర్భం వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ పై అభిమానాన్ని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చంపుకోలేకపోతున్నారు. తాజాగా మీడియా ముంగిటకు వచ్చిన ఈటల ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో బీజేపీ ప్రమేయమేమి లేదని చెప్పకుండా.. కాంగ్రెస్ హయంలోనే ప్రజాస్వామ్యం పరిడవిల్లిందని చెప్పుకొచ్చారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీకి ఇందులో ఖచ్చితంగా ప్రమేయం ఉండి ఉంటుందనో లేక, ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ పై మాట్లాడే అర్హత ఆ పార్టీ ప్రతినిధిగా తనకు లేదనుకున్నారో ఏమో కాని ఈ విషయాన్ని ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. పైగా కేసీఆర్ పై ఎదురుదాడి చేస్తూ కాంగ్రెస్ ను చంపుతావా అని మాట్లాడటం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ ను అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించి, అదే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మనసెలా ఒప్పిందంటూ కాంగ్రెస్ పార్టీ అనధికారిక ప్రతినిధిగా ఈటల మాట్లాడారు. ఆ పార్టీని నాశనం చేయాలని చూసిన నీకు మానవత్వం ఉందా అంటూ కేసీఆర్ ను ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు తెచ్చుకొని నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని కాని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయిందని చెప్పారు. కేసీఆర్ లాగా బానిసలుగా వ్యవహరించాల్సిన దుస్థితి నెలకొందని తన ఆక్రోశాన్ని గట్టిగానే వెళ్లగక్కారు ఈటల.
ఇక, ఓటుకు నోటు కేసు విషయమై స్పందించిన ఈటల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్ద రేవంత్ వ్యవహరించిన తీరు తప్పైతే.. మునుగోడులో , హుజురాబాద్ లో నువ్వు, నీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించిన తీరు తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు నేరుగా 6వేలు పంపిణీ చేసిన మీరు నోటుకు ఓటు కొనలేదని ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు. అప్రజాస్వామిక పద్దతుల్లో ఓటును కొనుగోలు చేసే సంస్కృతిని టీఆర్ఎస్ తీసుకొచ్చిందని మండిపడ్డారు.
బీజేపీలో వర్గపోరుతో ఈటల సతమతం అవుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.