బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగలనుంది. ఆయనకు అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ ను వీడిన పాత నేతలతో టచ్ లోకి వెళ్ళిన అధినాయకత్వం ఏనుగు రవీందర్ రెడ్డిని పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
టీఆర్ఎస్ ను ఈటల రాజేందర్ వీడిన సమయంలో ఆయనతోపాటు ఏనుగు రవీందర్ , తుల ఉమా కూడా కారు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఈటలతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వర్గపోరు వలన పార్టీలో ఈటల వంటి నేతకే ఆశించిన ప్రాధాన్యత దక్కకపోగా.. ఆయనతోపాటు పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ ను ద్వితీయ శ్రేణి నాయకుడిగా ట్రీట్ చేస్తున్నారు. పలుమార్లు ఈ విషయమై ఈటలతో ఏనుగు రవీందర్ రెడ్డి చర్చించినా ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు.. ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డితో టీఆర్ఎస్ అధిష్టానం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ లో చేరాలని ఆయనకు ఆహ్వానం పలుకగా మరో ఆలోచన లేకుండా అందుకు అంగీకరించారని సమాచారం. ఈటలకు కుడిభుజంగా ఉన్న ఏనుగు రవీందర్ బీజేపీని వీడాలని తీసుకున్న నిర్ణయం ఈటలకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.