తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో..? అక్కడేం చేస్తున్నారో సమాచారం లేదు. అంతా సీక్రెట్ గా ఉంచుతున్నారు. కూతురిని లిక్కర్ స్కాంలో కాపాడుకునేందుకే కేసీఆర్ పైరవీలు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఖండించడం లేదు. దీంతో కేసీఆర్ హస్తిన పర్యటన అనేక అనుమానాలకు దారితీస్తోంది.
గత బుధవారం ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ ఐదు రోజులుగా అక్కడే మకాం వేశారు. బీఆర్ఎస్ పై జాతీయ స్థాయిలో చర్చించేందుకే ఈ పర్యటన అని మొదట్లో చెప్పినా..కేసీఆర్ ఎవరితో భేటీ అయినట్లు కూడా సమాచారం లేదు. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పై చర్చ జరిగేలా ఢిల్లీలోనే బీఆర్ఎస్ విధి విధానాలు ప్రకటిస్తారనుకున్నా అది జరగలేదు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పీక్స్ కు చేరుతున్న దశలో ప్రచారానికి హాజరు కాకుండా కేసీఆర్ ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారు. పోనీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం ఏమైనా చేశాడా..? అది లేదు. దీంతో కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
కేసీఆర్ కాలక్షేపం చేసేందుకు ఫామ్ హౌస్ ఉండనే ఉంది. అలాంటిది ఆయన ఐదు రోజులపాటు ఢిల్లీలో మకాం వేశారంటే ఎదో మతలబు ఉండే ఉంటుంది. కాని ఆ సమాచారం ఏంటో అధికారికంగా ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. రోజులు గడిస్తే కాని కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన లోగొట్టు బయటపడేలా లేదంటున్నాయి రాజకీయ వర్గాలు.