కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించకుండా, బూర నర్సయ్యకు టికెట్ ఇస్తే సమిష్టిగా పని చేస్తామని టీఆరెఎస్ మునుగోడు నాయకులంతా స్పష్టం చేసినా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కూసుకుంట్లనే అభ్యర్థిగా బరిలో దించడం…ఆపై మునుగోడులో బీసీ సామజిక వర్గంలో మంచి ఆదరణ ఉన్న బూర నర్సయ్యను కాదని, మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఉప ఎన్నిక ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం…బూర నర్సయ్య టికెట్ ఆశిస్తున్నాడని తెలిసి కూడా ఆయనను బుజ్జగించకుండా పార్టీలో ఉంటె ఉండండి..లేదంటే వెళ్లిపోవచ్చునని జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ చేయడం…ఆ తరువాత బూర నర్సయ్యను ప్రగతి భవన్ కు కేసీఆర్ పిలిచి మాట్లాడటం…ఆపై కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే డాక్టర్ సాబ్ కూడా హస్తిన వెళ్ళడం…అక్కడ ఆయన బీజేపీ నేతలతో సమావేశం కావడం…ఏంటి ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగినట్టు ఉందని అనుకుంటున్నారా..? మీరనుకున్నదే నిజం.
మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని బలపరచడం వెనక బీజేపీకి లబ్ది చేకూర్చే ఎత్తుగడ ఉన్నట్లే, బూర నర్సయ్య బీజేపీలో చేరాలనే నిర్ణయం వెనక కేసీఆర్ ఉన్నారు. నియోజకవర్గంలో భారీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కూసుకుంట్లను బరిలో దించాలనే నిర్ణయం బీజేపీ అధినాయకత్వం నుంచి వచ్చిందనేది మునుగోడు లోకల్ లీడర్స్ వాదన. అందుకే బూరను పక్కన పెట్టేశారని స్వయంగా ఆ పార్టీ మునుగోడు నాయకులే చెప్తున్నా మాట. 2014లో భువనగిరి ఎంపీగా పని చేసిన బూర నర్సయ్యకు ఈ పార్లమెంట్ పరిధిలోని మునుగోడులో మంచి ఓటు బ్యాంక్ ఉంది. పైగా.. బీసీ సామజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఆ సామజిక వర్గానికి చెందిన బూర నర్సయ్యకు టికెట్ కేటాయించి బీసీ వకార్డును తెరపైకి తీసుకొస్తే టీఆరెస్ విజయం నల్లేరు మీద నడకే అయ్యేది. ఈ విషయం తెలిసి కూడా బూరకు టికెట్ నిరాకరించడం టీఆర్ఎస్ – బీజేపీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది స్పష్టం చేస్తున్నది.
ఇక, మాజీ ఎంపీ బూరకు మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని అంత ప్రచారం జరిగినా.. ఆయన్ను కాదని మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కట్టబెట్టారు. బూర నర్సయ్యను కలుపుకొని ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాల్సిన జగదీశ్వర్ రెడ్డి బూర నర్సయ్యను పార్టీలో ఉంటె ఉండు.. లేదంటే వెళ్లిపోవచ్చునని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఉప ఎన్నిక జరుగుతున్న వేళ మాజీ ఎంపీ పార్టీని వీడితే ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందో జగదీశ్వర్ రెడ్డికి తెలియనిది కాదు.. అలాంటిది విశేష రాజకీయ అనుభవం కల్గిన జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేసీఆర్ డైరక్షన్ లోనే జరిగిందన్న విశ్లేషణలు వినిపించాయి.
ఇదిలా ఉండగానే… బూర నర్సయ్యను ప్రగతి భవన్ కు పిలిపించుకున్న కేసీఆర్ ఆయనతో భేటీ అయ్యారు. ఆ తరువాత కేసీఆర్ ఢిల్లీ వెళ్ళడం.. ఆ వెంటనే బూర కూడా హస్తినలో వాలిపోవడం.. బండి సంజయ్ ఢిల్లీలో కనిపించడం క్రమానుగతంగా జరిగిపోయింది. కట్ చేస్తే… బూర నర్సయ్య బీజేపీలో చేరికకు రంగం సిద్దమైంది. ఈ క్రమానుగత రాజకీయాలను పరిశీలిస్తే బూర నర్సయ్య బీజేపీలోకి వెళ్ళడం కేసీఆర్ సూచన మేరకే జరిగిందని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఎందుకంటే.. కేంద్ర ఇంటిలిజెన్స్ చేసిన సర్వేలో బీజేపీకి ఓటమి తప్పదని తేలిన మరుసటి రోజే ఆయన బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపడం వెనక రాజకీయం చాలానే నడిచి ఉంటుందని చెబుతున్నారు.