టీఆరెస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు రెడీ అయిపోయారు. భారతీయ రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తోన్న కేసీఆర్.. రాష్ట్రంలోనున్న టీఆరెస్ ను బీఆర్ఎస్ లో విలీనం చేస్తారా..? లేక అనుసంధానంగా టీఆరెస్ ను కొనసాగిస్తారా..? అనే సందేహం అందరిలో నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర సమితి ఓ ప్రాంతీయ పార్టీ. ప్రస్తుతం కేసీఆర్ పార్టీకి అద్యక్షుడు. ఇప్పుడు జాతీయ పార్టీకి ఆయన అద్యక్షుడు కానున్నారు. అలాగని, ఓ ప్రాంతీయ పార్టీకి , జాతీయ పార్టీకి అద్యక్షుడిగా కేసీఆర్ కొనసాగలేరు. దాంతో టీఆరెస్ ను బీఆర్ఎస్ లో విలీనం చేయాల్సి ఉంది. టీఆరెస్ ఇదే పని చేస్తే అంతకన్నా తెలివి తక్కువ పని మరొకటి ఉండదేమో. ఎందుకంటే.. తెలంగాణ అంటే టీఆరెస్ అన్నట్లుగా జనాల్లో ఓ రకమైన అభిప్రాయం ఏర్పడింది. అలాంటిది జాతీయ రాజకీయాల అవసరాల కోసం పార్టీ పేరు మార్చితే ఆ సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రకమైన నిర్ణయాలతో జనాల్లో నెలకొన్న అభిప్రాయాన్ని మనమే తొలగించిన వాళ్ళం అవుతామని టీఆరెస్ క్యాడర్ ఆందోళనగా చెబుతోంది.
టీఆరెస్ ను బీఆర్ఎస్ లో విలీనం చేసినా కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పార్టీ సింబల్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మరో సంవత్సర కాలంలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త గుర్తును టీఆరెస్ నేతలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు అన్నది బిగ్ క్వశ్చన్. అయితే , తెలంగాణలో మాత్రం టీఆరెస్ కొనసాగుతుందని, మిగతా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పేరిట అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తారనే వాదనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. టీఆరెస్ కు కేటీ రామారావు అద్యక్షుడిగా కొనసాగుతారని, బీఆర్ఎస్ కు కేసీఆర్ ప్రెసిడెంట్ అవుతారని కూడా అంటున్నారు. ఇలాంటి అనేక సందేహాలపై జాతీయ పార్టీ ప్రకటన రోజున కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.