తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? నానాటికీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత మరో సంవత్సరమైతే మరింత పెరగడం తప్పితే తగ్గే ఛాన్స్ లేదని గులాబీ బాస్ కలవరపడుతున్నారా..?మునుగోడు బైపోల్ ఆలస్యం అవుతుండటంతో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్నారా..? ఓ వైపు బీజేపీ , కాంగ్రెస్ బలపడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి ముందస్తు ఎన్నికలకు సై అనాలనుకుంటున్నారా..? పీకే ను ఆల్ ఆఫ్ సడెన్ గా ఊడపీకడం ఇందులో భాగమేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ సెప్టెంబర్ మాసంలోనే వెలువడుతుందని అనుకుంటే నవంబర్ లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ట్రెండ్స్ టీఆరెఎస్ కు ఏమంత అనుకూలంగా లేవు. ప్రైవేట్ సంస్థలు, నిఘా వర్గాలతో సర్వేలు చేయించిన కేసీఆర్ .. ఈ సర్వేలో టీఆరెస్ కు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని మూడు విడతలుగా చేయించిన సర్వేలో వెల్లడి కావడంతో.. ఈ విజయం వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ ను బూస్టింగ్ నిచ్చేదే కాకుండా.. ఆ పార్టీలోకి వలసలను మరింత పెంచడం ఖాయమని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఊపులోకి రాకుండా చేయాలన్నా.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఎపిసోడ్ ను పక్కదోవ పట్టించాలన్న ముందస్తే పరిష్కారంగా కేసీఆర్ ఆలోచిస్తున్నారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
పైగా, షెడ్యూల్ మేరకు ఎన్నికలకు వెళ్తే టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని జ్యోతిష్యులు చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 2023 సంవత్సరం కేసీఆర్ కు అంత అనుకూలంగా లేదని…పైగా జ్యోతిశ్యాన్ని బలంగా విశ్వసించే కేసీఆర్ ఈ ఏడాదిలోనే ముందస్తు ఎన్నికలకు వెళతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు 6 నెంబర్ సెంటిమెంట్. 2022లోని మూడు రెండ్లు కలిపితే ఆరు అవుతుంది కాబట్టి.. సెంటిమెంట్ దృష్ట్యా ఆలోచిస్తే ఆయన ఈ ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే , మునుగోడు ఉప ఎన్నిక జరిగాక ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది..? లేదా ఉప ఎన్నికకు ముందే ముందస్తుకు వెళ్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందన్న అంశంపై ఆయన వారం రోజులుగా ఫామ్ హౌస్ లో చర్చించినట్లుగా తెలుస్తోంది. ముందస్తుకు మొగ్గు చూపారు కాబట్టే పీకే అవసరం లేదనుకొని ఆయన సర్వే టీం ను ఊడపీకేశారని అంటున్నారు. ఏదీ, ఏమైనా దసరా తరువాత కీలక ప్రకటన ఉంటుందన్న టీఆరెస్ నేతల ప్రకటనలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.