మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెస్ , బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని టీపీసీసీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండల కేంద్రంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చలమల్ల కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టీఆరెస్ , బీజేపీలు ఒకటయ్యాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడులో ఓటర్ కు ఐదు వేలు పంచుతూ ఓట్ల బేరానికి దిగాయని టీఆరెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. మందు- విందు రాజకీయాలను ప్రోత్సహిస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని నిప్పులు చెరిగారు. సొంత పార్టీ కార్యకర్తలే కొత్తగా పార్టీలో చేరుతున్నట్లు కండువాలు కప్పేసి కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేసేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్సే రెండు పార్టీల టార్గెట్ ఐందంటేనే.. నియోజకవర్గంలో హస్తం పార్టీ ఎంత బలంగా ఉందొ అర్థం చేసుకోవచ్చునన్నారు. పార్టీని నాయకులు వీడినా, కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ వస్తుందని… దీన్ని బట్టి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని అర్థం అవుతుందని చెప్పారు చలమల్ల కృష్ణారెడ్డి. కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందంటూ ఆయన పిలుపునిచ్చారు.