రాజకీయాల్లో విలువలు పతనం అంచున ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. పదవో, పైసలో ఆఫర్ చేశారంటే చాలు సెకండ్ థాట్ లేకుండా పార్టీ ఫిరాయించడం చూస్తూనే ఉన్నాం. తద్వారా రాజకీయ నాయకులు తమ విలువలను కోల్పోవడమే కాకుండా ప్రజల్లో రాజకీయాలంటేనే అసహ్యం కల్గేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ రాలేదని ఓ పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేసే జంప్ జిలానీలను కొదువే ఉండదు. అప్పటివరకు టికెట్ వస్తుందని కోటి ఆశలు పెట్టుకొని పార్టీ టికెట్ నిరాకరించే సరికి అదే పార్టీతో పెనవేసుకున్న బంధాన్ని ఈజీగా తెంచుకునే నేతలు బోలెడు మంది ఉన్నారు. కాని, పార్టీతో బంధం తెంచుకోవడమంటే బొడ్డు పేగు బంధాన్ని తెంచుకోవడమేనని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా..? అంటే ఉన్నారు.
ఆ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు చలమల్ల కృష్ణారెడ్డి. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా చలమల్ల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం ఫైనల్ అయిందంటూ ప్రధాన స్రవంతి మీడియాలో వార్తలు కూడా వెలువడ్డాయి. చలమల్ల అనుచరులు కూడా టికెట్ వస్తుందనే ధీమాతోనే ఉన్నారు. కొన్ని కారణాల వలన చలమల్లకు టికెట్ దక్కకపోయినా ఆయన మోహంలో కాస్త కూడా నిరాశ , నిస్పృహలు కనిపించకపోవడం, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన చేస్తోన్న కృషిని చూసి రాజకీయ అవకాశవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా..రాజకీయాలకు విలువలను జోడించాలని మాట్లాడే రాజకీయ మేధావులు, విశ్లేషకులు సంబరపడుతున్నారు. ఇలాంటి వ్యక్తిత్వం కల్గిన నేతలు రాజకీయాల్లోకి వచ్చే కొత్తతరానికి టార్చ్ బేరర్ గా నిలుస్తారని అభిప్రాయపడుతున్నారు.
పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి తన పట్ల ఉంచిన నమ్మకాన్ని చలమల్ల కృష్ణారెడ్డి వమ్ము చేయకుండా నిబద్దతను చాటుకోవడం విలువల రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.పదవుల కోసమే రాజకీయాలన్న అభిప్రాయాలను ఆయన తుడిచేస్తూ విలువలను అద్ది తన స్థాయిని మరింత పెంచుకొని , మరెంతోమంది నేతలకు అనతికాలంలోనే స్ఫూర్తివంతమైన లీడర్ అయ్యాడంటే ఆయన కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరపతి పెంచుకునేందుకు ప్రజలు పెట్టిన నమ్మకాన్ని, తనకు రాజకీయంగా గుర్తింపునిచ్చిన పార్టీలను కాంట్రాక్ట్ లకోసం, పదవుల కోసం అమ్మేసుకుంటున్న నేతలున్న ఈ సందర్భంలో వారందరికీ చలమల్ల కృష్ణారెడ్డి కమిట్మెంట్ కనువ్విపు కల్గించాలని మనసారా కోరుకుందాం.