కుల – మత రాజకీయాలతో విచ్చనమైన భారత్ ను ఐక్యం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కన్యాకుమారిలో చేపట్టిన ఈ యాత్ర కశ్మీర్ వరకు 3500కిలోమీటర్లు కొనసాగనుంది. ఈ యాత్ర చేపట్టి రెండు వారాలు అవుతోంది. భారత్ జోడో యాత్రకు జనం నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చాక క్రమంగా ఫోర్త్ ఎస్టేట్ ను తమ గుప్పిట్లోకి తీసుకున్న బీజేపీ.. తమ అనుకూల ఛానెల్ లో భారత్ జోడో యాత్రకు కనీసం స్పెస్ ఇవ్వడంలేదు. కాంగ్రెస్ అనుకూల ఛానెల్ లేకపోవడం, నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్ళే ఎన్డీటీవీ ని కూడా మోడీ తన మిత్రుడు ఆదానీకి కట్టబెట్టి ఫోర్త్ ఎస్టేట్ ను భజన మండలిగా మార్చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ సెన్సేషన్ కావాల్సిన రాహుల్ గాంధీ పాదయాత్ర సోషల్ మీడియా పుణ్యమా అని కొద్దికొద్దిగా జనాల్లో చర్చ సాగేలా చేస్తోంది.
బీజేపీ నేతలు ఏ చిన్న కార్యక్రమం చేసినా దానికి ప్రశంసలవాక్యాలను అల్లి చూపిస్తోన్న మీడియా రాహుల్ గాంధీ దేశ ఐక్యత కోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తోన్న కనీసం ఆ వార్తకు స్పెస్ ఇవ్వకపోవడం పడిపోతున్న జర్నలిజం విలువలకు ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. పాదయాత్రగా వెళ్తున్న రాహుల్ గాంధీతో ఓ కరచాలనం కోసం , ఓ ఓదార్పు కోసం, బీజేపీ చేసిన గాయాల గేలి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ విశ్వాసం కోసం రాహుల్ తో కదం కలుపుతున్న దృశ్యాలు ప్రజాస్వామ్య వాదులకు ,లౌకిక వాదులకు భవిష్యత్ రాజకీయాలపై ఓ భరోసాను కల్పిస్తున్నాయి. మతం పేరుతో దేశ ప్రజల మధ్య విభజన రేఖలు గీస్తోన్న బీజేపీ అధికారానికి భారత్ జోడో యాత్ర పూర్తయ్యే నాటికీ ఉరితాడు పేనడం, అదే సమయంలో దేశ వ్యాప్తంగా జోడో యాత్ర ఓ ప్రభంజనం సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయినా, మీడియా అధికార పార్టీల అడుగులకు మడుగులు ఒత్తడంతో ఫోర్త్ ఎస్టేట్ పై జనాలు నమ్మకం కోల్పోయారు. సోషల్ మీడియానే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఇంకాస్త గట్టిగా ఫోకస్ చేస్తే రాహుల్ యాత్ర మరో రాష్ట్రంలోకి చేరే నాటికీ దేశ వ్యాప్తంగా కొత్త చరిత్రను ఆవిష్కృతం చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.