సెప్టెంబర్ 17పై టీపీసీసీ కీలక ప్రతిపాదనలు
సెప్టెంబర్ 17కు సంబంధించి మూడు కీలక అంశాలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతిపాదించారు. టీఆరెస్ కు పర్యాయపదంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం కేసీఆర్ టీఎస్ అని తీసుకొచ్చాడని..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీన్ని సవరించి టీజీ పెట్టుకోవాలని ఆయన సమావేశంలో ప్రతిపాదించారు. ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలిన అవసరముందన్నారు. అలాగే సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. సెప్టెంబరు 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు సూచనలు చేయాల్సిందిగా పార్టీ నేతలను కోరారు రేవంత్. సెప్టెంబర్ 17తో ఎలాంటి సంబంధం లేని బీజేపీ… మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పేటెంట్ ను బీజేపీ, టీఆరెస్ హైజాక్ చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని ఆయన అన్నారు. చరిత్రను కనుమరుగు చేసి కేసీఆర్ తనకు అనుకూలంగా కొత్త చరిత్రను రాసుకుంటున్నాడని మండిపడ్డారు. వాస్తవ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు.
మునుగొడులో సమిష్టిగా పనిచేయాలి
మునుగోడు ఉప ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పని చేయడానికి 8 యూనిట్లుగా విభజించి నాయకులకు బాధ్యతలు నిర్ణయింమన్నారు రేవంత్.
బూత్ కు ఇద్దరు చొప్పున 300 బూత్ లకు 150 మందిని నియమించాలని పార్టీ భావిస్తోందన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా సెప్టెంబర్ 18 నుంచి అందరూ చిత్తశుద్ధితో కలిసి చేయాల్సిందేనని తెలిపారు. క్షేత్ర స్థాయిలో టీఆరెస్, బీజేపీలను ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించి..కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
15రోజుల్లో మూడు పెద్ద సభలు
భారత్ జోడో యాత్ర దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు రేవంత్. రాహుల్ యాత్రకు వస్తున్న ఆదరణ చూడలేక బీజేపీ చిల్లర మల్లర ప్రచారానికి దిగుతోందని విమర్శించారు. అక్టోబర్ 24 న రాహుల్ యాత్ర తెలంగాణకు రాబోతోందని, 15 రోజులపాటు తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. మక్తల్ నుంచి మద్నూర్ వరకు 350 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని, యాత్రలో భాగంగా మూడు పెద్ద సభలు నిర్వహించాలని భావిస్తున్నామని రేవంత్ తెలిపారు. ప్రతిపాదనలపై తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.