కాంగ్రెస్ వైపు ఆశగా అన్నదాతలు..!
రైతులను రాజులను చేస్తామని అధికారంలోకి వచ్చింది తడవు ఇప్పటివరకు అదే డైలాగ్ తో అన్నదాతలను నమ్మబలుకుతు వస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నదాతలను నట్టేట్టా ముంచేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. 2018ముందస్తు ఎన్నికల్లో రైతు బంధు పథకం, రైతు రుణమాఫీ అంటూ అన్నదాతల మెప్పు పొందిన గులాబీ అధినేత అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నారు. నిధుల కటకట కొనసాగుతూ ఉండటంతో రైతు బంధు సకాలంలో అందటం లేదు. ఇక, రైతు రుణమాఫీ చేస్తామని మూడేళ్ళుగా ఊరిస్తునే ఉన్నారు. కాని హామీని నెరవేర్చడం లేదు. దీంతో రుణమాఫీ అవుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న తెలంగాణ రైతాంగానికి బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. చేసిన అప్పుకు వడ్డీ అంతకంతకు పెరగడంతో రైతులు ఎం చేయాలో తోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తూ చనిపోయిన 750 మంది రైతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఆర్ధిక సహాయం అందజేసిన కేసీఆర్ సర్కార్ తీరుపై రాష్ట్ర రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో రైతురుణమాఫీ సకాలంలో జరగక, పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రాంత రైతులను కనీసం పరామర్శించని కేసీఆర్… దేశ్ కీ నేతగా ప్రొజెక్ట్ కావడం కోసం ఈ ప్రాంత ప్రజల నెత్తురును మరో ప్రాంతంకు తాకట్టు పెడుతున్నాడన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. దేశోద్దరకుడిలా పంజాబ్ రైతులకు పరిహారం అందించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ రైతులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించలేదు కాని, తెలంగాణలో ప్రభుత్వ అసమర్ధత వలన ఆత్మహత్యలు చేసుకున్న వారిని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయినా కేసీఆర్ ఈ ప్రాంత రైతులపై కరుణించలేదు.
కేసీఆర్ మీడియా ముగింటకు వచ్చే ప్రతిసారి తన పాలనలో రాష్ట్రం వెలిగిపోతుందనే డైలాగ్ లతో విమర్శకులను సైతం ఆలోచనలో పడేస్తాడు. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా అమలౌతున్నాయా..? అంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేయడం పరిపాటిగా ఆయన ప్రెస్ మీట్ లో వినిపించే రిపిటేడ్ డైలాగ్. చత్తీస్ ఘడ్ లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి వందశాతం రుణమాఫీ చేసింది భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. మరి రుణమాఫీ విషయంలో చత్తీస్ ఘడ్ సర్కార్ ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోరా..? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని జర్నలిస్టులు చెబుతుంటే.. హే రాహుల్ ఎందుకయ్యా పనికిమాలిన మాటలు…అంటూ దబాయింపు వ్యాఖ్యలు చేయడంలో కేసీఆర్ నేర్పరి.
రైతు రుణమాఫీ ఊసేలేదు.. కనీసం పోడు రైతుల సమస్యలను కూడా పరిష్కరించడం లేదు. రెండు గంటలపాటు ప్రెస్ మీట్ పెట్టె కేసీఆర్ … పోడు రైతుల సమస్యలను ఓ చిన్న సమీక్ష చేసి ఒక్క సంతకంతో వారి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదో…?! ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో పోడు భూముల సమస్యలను ఎన్నికల స్టంట్ గా ఉపయోగించుకునే ఆలోచనలో కేసీఆర్ ఉండి ఉండవచ్చునన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. రుణమాఫీని కూడా ఎన్నికలకు సమయం దగ్గర పడిన సమయంలో పూర్తి చేసి రైతు బాంధవుడిగా కీర్తిపొందాలని వ్యూహంలో భాగంగా సాగదీతల పర్వం కొనసాగుతుందని అంటున్నారు. మరి అప్పటివరకు ఎంతమంది అన్నదాతలు ఉరికొయ్యలకు వేలాడుతారో..? పోడు భూముల హక్కుల కోసం కోసం ఆదివాసీ , గిరిజనులు లాటీలకు ఎన్నిసార్లు వెన్ను చూపాలో..!