2014 జూన్ ! డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 59. 15
2022 జూన్ 29 … 78. 97 పైసలకు పతనమై.. 80 రూపాయిలకు చేరవు అవుతోన్న రూపాయి విలువ !
నరేంద్ర మోదీ పరిపాలన మొదలైన తర్వాత 8 ఏళ్లలో అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ ఎన్నడూ చూడని కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ పతనం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. 2022 జనవరి 12న ఒక డాలర్‌కి రూపాయి మారకం రూ. 73.77గా ఉంది. అప్పటి నుంచి మన కరెన్సీ విలువ రూ.5 పడిపోయి, బుధవారం (జూన్ 29 ) నాటికి రూ.78.97కి చేరుకుంది. అతితక్కువ సమయంలో ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ రూపాయి విలువ ఇంతలా పడిపోలేదు. 2022 – 23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూపాయి మరింతగా క్షీణించి రూ. 81 కి చేరవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూపాయి పతనం.. పేదవాడి బతుకుని ఇంకా భారం చేస్తుంది. పడిపోయే ప్రతిపైసా సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతుంది. భారత దేశం పలు నిత్యావసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పెట్రోల్ సహా పలు ఆహార పదార్థాలు ఈ జాబితాలో ఉన్నాయి. వాటిని దిగుమతి చేసుకునేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్లలో చెల్లించాలి. డాలర్ తో రూపాయి మారకం విలువ ఎంత తగ్గితే.. అంత ఎక్కువగా మన చెల్లింపులు ఉంటాయి. ఫలితంగా దిగుమతి చేసుకున్న పదార్థాలకు మన దగ్గర రేట్లు పెరుగుతాయి. దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. ఇది ఎంత పెరిగితే పేదలకు, సామాన్యులకి అంత కష్టం. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి కుటుంబ వ్యయాలు పెరిగిపోతాయి.
రూపాయి పతనానికి కారణం ఏంటి ?
అంతర్జాతీయ మార్కెట్లు, అగ్ర దేశాల ఆర్థిక విధాన నిర్ణయాలు, మన దేశ కేంద్ర ప్రభుత్వ విధానాలు.. డాలర్ తో రూపాయి మారకం విలువపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న రూపాయి పతనానికి పైవన్నీ కారణాలే అని చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు దేశీయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న పాలసీలతో రూపాయి విలువ ఆల్ టైం కనిష్ఠ స్థాయిల్ని చూస్తోంది. అంతర్జాతీయంగా చూస్తే… ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతో ఇంధన, వంట నూనెల ధరలు పెరిగాయి. ఆ రెండు దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధం ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థల్ని అనిశ్చితిలోకి నెట్టింది. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠినమైన ద్రవ్య విధానం తీసుకొచ్చింది. దీంతో.. సాధారణ డాలర్ బల పడింది. దీంతో… మన దేశంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల చూపు అటు వైపు మళ్లింది. దీనికితోడు.. అప్పుల మీద అప్పుల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరు.. భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సన్నగిల్లేలా చేసింది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసిన మొత్తం అపులు.. రూ. 55,87,149 కోట్లు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. అప్పటి నుంచి 2022 వరకు చేసిన అప్పులు రూ. అక్షరాలా.. రూ.80,00,744 కోట్లు. అంటే.. 67 ఏళ్లలో దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పులు కంటే.. కేవలం 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువ. ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దేశాన్ని అప్పులకుప్పగా మార్చేసింది. గడిచిన 8 ఏండ్లలో ఏటా సగటున రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇదే సమయంలో భారత వృద్ధి రేటు కూడా మందగించింది. అంతర్జాతీయ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై తమ రేటింగ్ ని తగ్గిస్తూ వస్తున్నాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తోన్న అసమర్థ విధానాలే ఈ పరిస్థితి కారణం. ఇలాంటి ప్రతికూల పరిస్థితులతో ఫారిన్ ఫోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) మన దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఈ సమయంలోనే అమెరికా తీసుకున్న కఠిన ఆర్థిక నిర్ణయాలతో డాలర్ స్థిరంగా కొనసాగుతోంది. దీంతో… మన దేశంలో పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఇన్వెస్టర్లు… సురక్షిత వ్యాపారం కోసం అమెరికాకు తరలివెళుతున్నారు. ఇలా.. 2021 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు రూ. 2.69 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అదే నెల నుంచి విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా తరలిపోతున్నాయి. ఈ అవుట్ ఫో కొనసాగడంతో గత కొన్ని నెలలుగా రూపాయి అంతకంతకూ పతనం అవుతూనే ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ?
ఓ వైపు రూపాయి విలువ రోజు రోజుకీ పడిపోతున్నా.. మోదీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఒడిదుడుకులతో రూపాయి పతనం అవుతోందని చెబుతూ.. తమ అసమర్థతని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర చెబుతున్నట్లు.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వల్ల పెట్రెల్ – వంట నూనెల ధరలు పెరిగాయి. అది నిజమే. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులూ మనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అదీ నిజమే. ఉత్తర భారతంలో విపరీత వాతావరణ పరిస్థితులతో పంటల దిగుబడి తగ్గడమూ ఓ కారణమే. అయితే… భారత ఆర్థిక వ్యవస్థ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనుతిరిగి వెళ్లడానికి ఎవరు కారణం ? అప్పులపై అతిగా ఆధారపడుతోందనే అపకీర్తిని మోసుకొచ్చింది మోదీ ప్రభుత్వం కాదా ? ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నిధుల ఉపసంహరణ చేస్తున్నా.. వారిలో నమ్మకం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా.. వాటిని వినియోగించే తీరు సరిగ్గా లేకనే కదా.. భారత్ మార్కెట్ పై నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. తిరిగి వారిలో విశ్వాసం కలిగించేందుకు ఇటీవల కాలంలో మోదీ సర్కార్ తీసుకున్న విధాన నిర్ణయం ఒక్కటంటే ఒక్కటీ లేదు. ప్రతిపక్షాలు – ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై రాజకీయ దాడులు చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంపై బీజేపీకి ఉన్న శ్రద్ధ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై లేదన్నది సుస్పష్టం. డాలరుతో రూపాయి మారకం విలువ రోజు రోజుకీ పడిపోయి… దేశంలో పేదవాడి జీవనం అధోగతిపాలవుతున్నా… మోదీ మాత్రం రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఏ రాష్ట్రంలో ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని పడగొట్టాలి, అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకోవాలి, ఎక్కడ మత గొడవలు సృష్టించాలి – వాటితో ఎలా రాజకీయంగా తమకు అనుకూల ఫలితాలు రాబట్టుకోవాలి అనే అంశాలపైనే బీజేపీ దృష్టంతా. ఈ దుష్ట పాలనకు స్వస్తి చెబితేనే భవిష్యత్తుపై భరోసా. లేకుంటే ఇంతకింతా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందేమో !!