తెలంగాణలో వచ్చే ఏడాది రానున్న ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో కీలకం. టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో కొంచెం ఇష్టం – చాలా కష్టం అన్న భావన వచ్చింది. గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు జనం నాడిని పరిశీలిస్తే.. వారంతా మంచి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ.. అధికారం కోసం పోటాపోటీగా పోరాడుతున్నాయి. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే మాత్రం.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే… కాంగ్రెస్ వల్లే సాధ్యమన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లోను నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే, మెజారిటీ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది సీనియర్ నాయకుల అంచనా. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మెదక్ పార్లమెంట్ పరిధిలోను .. ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైకి అంతా ఒక పార్టీ వైపే అన్నట్లు ఉన్నా.. ప్రతిపక్ష పార్టీలు తొందరలోనే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి, నియోజకవర్గాలకు పంపితే .. గ్రౌండ్ లెవల్లో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారవుతాయి.
మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజవర్గాలు ఉన్నాయి. అవి సంగారెడ్డి, పటాన్ చెరు, నర్సాపూర్, మెదక్, దుబ్బాక, సిద్ధిపేట్, గజ్వేల్. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ( కాంగ్రెస్), దుబ్బాక నుంచి రఘునందన్ రావు (బీజేపీ) ఎమ్మెల్యేలుగా ఉండగా.. మిగతా 5 నియోజవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి, ఆర్థిక మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట నుంచి, పటాన్ చెరు నుంచి మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ నుంచి మధన్ రెడ్డి, మెదక్ నుంచి పద్మాదేవందర్ రెడ్డి టీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 2018 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన టీఆర్ఎస్.. మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో అప్పటి ఫలితాలు పునరావృతం చేస్తామన్న ధీమాతో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి ఆనాటి అనుకూల పరిస్థితులు లేవు. టీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ విధానాలపై జనాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేల వ్యవహారశైలి, భూ కబ్జాలు, దందాలు చూసి ఓటర్లలో సహనం నశించింది. ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి, బరిలో దిగితే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు వారికి అనుకూలంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో నియోజవర్గం మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోటీ చేస్తారని, లేదా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు మెదక్ ఎంపీగా బరిలోకి దిగుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే జరిగితే గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి ఈ నియోజవర్గ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నర్సారెడ్డికి అనుకూలంగా మారవచ్చు. అలాగే.. కాంగ్రెస్ లో ఉంటూ కేసీఆర్ పై పోరాడిన వంటేరు ప్రతాప్ రెడ్డి, మళ్లీ అదే టీఆర్ఎస్ గూటికి చేరడంతో స్థానికంగా ఆయనపై ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా, ఆ వ్యతిరేకతను అధిగమించి గెలుపొందడం అంత సులువైనా పని కాదు. బీజేపీకి గజ్వేల్ నుంచి చెప్పుకోదగ్గ గట్టి నాయుకుడు లేడు. 2018 ఎన్నికల్లో కమలం పార్టీ తరపున పోటీ చేసిన ఆకుల విజయ కేవలం 1,587 ఓట్లు మాత్రమే పొందగలిగారు. ఆ తర్వాత కూడా గజ్వేల్ లో బీజేపీ పుంజుకున్నది లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ శాసనసభ స్థానంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంత ముందుగా అభ్యర్థిని ప్రకటిస్త్తే.. ఆ పార్టీకి అంత ప్లస్ అవుతుంది.
సంగారెడ్డి నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పై 2,522 ఓట్లతో జగ్గారెడ్డి గెలుపొందారు. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ కేవలం 7 వేల ఓట్లు పొందింది. బేజీపీ తరపున మరోసారి రాజేశ్వర్ రావు దేశ్ పాండే… టీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ పోటీలో ఉండే అవకాశం ఉంది. స్థానికంగా జగ్గారెడ్డికి మంచి ఫాలోయింగ్, బలమైన క్యాడర్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని సాధించుకోగలిగితే .. జగ్గారెడ్డి మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
2018 శాసనసభ ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 37 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ కి 78 వేల ఓట్లు.. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి కర్ణాకర్ రెడ్డికి 7 వేల ఓట్లు వచ్చాయి. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న మహిపాల్ రెడ్డిపై నియోజవర్గ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అనుచరగనం సాగిస్తోన్న ఆగడాలు మితమీరాయన్న విమర్శలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక పటాన్ చెరు అసెంబ్లీ పరిధి కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చింది. కార్యకర్తలు కొత్త జోష్ తో ముందుకు సాగుతున్నారు. సరైన అభ్యర్థిని బరిలో దింపితే గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ వేగంగా పావులు కదుపుతోంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని, ఓటర్లకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజవర్గంలో త్రిముఖ పోరు జరిగేలా కనిపిస్తోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి 97 ఓట్లు పొందిన టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవందర్ రెడ్డి.. 47 వేల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అమ్మారెడ్డి ఉపేందర్ రెడ్డికి 49, 687 ఓట్లు…. బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఆకుల రాజయ్యకు 6 వేల ఓట్లు పోలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మళ్లీ పద్మాదేవందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే.. నియోజవర్గంలో ఆమెపై వ్యతిరేకత పెరిగింది. అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సంగతి అటుంచి, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పద్మాదేవందర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి !
నర్సాపూర్ నుంచి టీఆర్ఎస్ తరపున మధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు లక్షా 5 వేల ఓట్లు… కాంగ్రెస్ కు 67 వేల ఓట్లు.. బీజేపీకి 2,800 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సునీత లక్ష్మారెడ్డి, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన సింగయ్య పల్లి గోపీ మరోసారి బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి బలమైన క్యాడర్ ఉంది. వారందరినీ ఏకం చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓటూ చీలకుండా తమవైపు తిప్పుకోగలిగితే హస్తం పార్టీ జయకేతనం ఎగురవేయవచ్చు.
పటాన్ చెరు, నర్సాపూర్, మెదక్ అసెంబ్లీ స్థానాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. 2019 ఎంపీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పోటీ చేశారు. ప్రభాకర్ రెడ్డి MP గా గెలువగా… గట్టి పోటీ ఇచ్చిన గాలి అనిల్ రెండో స్థానంలో నిలిచారు. పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడింటిలో .. అంటే.. పటాన్ చెరు, నర్సాపూర్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గాలి అనిల్ కుమార్ మంచి ఓటింగ్ శాతాన్ని రాబట్టారు. పటాన్ చెరులో, నర్సాపూర్ లో , మెదక్ లో అసెంబ్లీ స్థానాల్లో తెరాస పార్టీకి గట్టి పోటీ ఇచ్చాడు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న గాలి అనిల్ కుమార్.. ఈ మూడు నియోజవర్గాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాలు నిర్మాణాలకు విరాళాలు ఇస్తున్నారు, మొబైల్ చలివెంద్రాలు నిర్వహిస్తూ నిత్యం పెల్లిలకు, చావులకు హాజరవుతూ, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి చేతనైన సహాయం చేస్తున్నారు. ప్రజల హక్కుల సాధన కోసం అధికార పార్టీపై స్థానికంగా అందుబాటులో ఉంటూ పోరాడుతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని గాలి అనిల్ కుమార్ ముందుండి నడిపించారు. ఈ మూడు నియోజవర్గాల్లో బూత్ స్థాయిలో అత్యధిక ఎన్ రోల్ మెంట్ చేసిన కార్యకర్తలను ఆహ్వానించి, సన్మానించారు. తద్వారా పనిచేసే కార్యకర్తలకు తానెప్పుడూ అండగా ఉంటానన్న భరోసా కల్పించారు. కింది స్థాయి నుంచి కార్యకర్తల మద్దతు, నాయకుల సహకారం, ప్రజల్లో సానుకూల అభిప్రాయం సంపాదించిన గాలి అనిల్ కుమార్… వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే పటాన్ చెరు, నర్సాపూర్, మెదక్ లలో ఏ అసెంబ్లీ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అధిష్టానం ఏ నియోజవర్గంలో అవకాశం కల్పించినా, పార్టీని గెలిపించి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మెదక్ నుంచి కంఠా తిరుపతి రెడ్డి, పటాన్ చెరు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.
దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత రఘునందన్ రావు.. మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచే సూచనలు ఉన్నాయి. ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పట్టించుకోలేదన్న విమర్శ రఘునందన్ రావుపై ఉంది. రాష్ట్ర రాజకీయాలపై ఉన్న ఆసక్తి, నియోజకవర్గంపై లేదనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో దుబ్బాక పోరు మరోసారి రక్తికట్టనుంది.
సిద్ధిపేట ఆర్థిక మంత్రి హరీశ్ రావు కంచుకోట. గత ఎన్నికల్లో లక్ష మెజారిటీ సాధించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. హరీశ్ మరోసారి సిద్ధిపేట నుంచే బరిలో నిలుస్తారని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి భవానీ రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి జిల్లా బిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్న సూర్య వర్మగారు కూడా ఆక్టివ్ గా తిరుగుతున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన సూర్య వర్మ పార్టీ రచ్చబండ కార్యక్రమాలతో పాటు హెల్త్ క్యాంప్ వంటివి కరోనా టైమ్ లో పెట్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు. బీజేపీ నుంచి ఎవరు ఉంటారన్న దానిపై స్పష్టత లేదు. నియోజవర్గంలో చేసిన అభివృద్ధి, అందరికీ అందుబాటులో ఉండే తీరుతో.. హరీశ్ రావుకి స్థానికంగా మంచి పేరు ఉంది. ఆయన్ని బలంగా ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు పదునైన వ్యూహంతో రావాల్సి ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. ఈ 7 నియోజవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తామని ధీమాగా చెప్పగలిగేవి ఒకటి లేదా రెండు మాత్రమే. గట్టిగా పోరాడితే మిగతా నియోజవర్గాల్లో ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరికైతే … ఆయా అసెంబ్లీ నియోజవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారన్నది కేవలం ఊహాగానాలే. ఈ ఊగిసలాటను ఎన్నికలకు నెల ముందు వరకు కొనసాగిస్తే.. టీఆర్ఎస్ నెత్తిమీద పాలు పోసినట్లే అవుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఏడాది లేదా కనీసం 9 నెలల ముందుగానైనా అభ్యర్థులను ప్రకటిస్తే… క్షేత్రస్థాయిలో బలం పుంజుకునే వీలు దక్కుతుంది. వ్యూహ, ప్రతివ్యూహాలను అమలు చేసే సమయం దొరుకుతుంది. ఆ దిశగా కాంగ్రెస్, బీజేపీ నిర్ణయం తీసుకుంటే… మెదక్ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది !