-మున్నురు కాపుల ఓట్లపై గురిపెట్టిన తెరాస, బీజేపీ.
-మున్నురు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్.
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా క్యాస్ట్ బేస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలు కులాల వారీగా ఉన్న ఓట్ల శాతాన్ని బట్టి వారికి రాజకీయ ప్రాథమ్యం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు మున్నురు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. జనాభాలో 18శాతం ఉన్న వీరిని తమ వైపు తిప్పుకునేందుకు తెరాస, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. గతంలో మున్నురు కాపులు కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. పార్టీలో సైతం వీరికి అదే స్థాయిలో ప్రాథమ్యం ఉండేది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి నలుగురికి మంత్రి పదవులు వచ్చాయి. పార్టీ పగ్గాలు సైతం డీ. శ్రీనివాస్, పోన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ వంటి వారికి అప్పగించారు.
కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మున్నురు కాపులకు ఆధరణ తగ్గింది. దీన్ని బీజేపీ పార్టీ ఆసరగా చేసుకుంది. తమ పార్టీలోని కాపు నాయకులకు అధిక ప్రాథమ్యం ఇవ్వడం ప్రారంభించింది. టికెట్ల జారీలోనూ ప్రాముఖ్యత ఇచ్చారు. నలుగురు బీజేపీ ఎంపీలు గెలిస్తే.. వీరిలో ఇద్దరు మున్నురు కాపులే కావడం పార్టీ అధినాయకత్వానికి నమ్మకం కలిగించింది. బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షున్ని చెయ్యడంతో పాటు.. డా. లక్ష్మణ్ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షున్ని చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు సైతం పార్టీలో అధిక ప్రాథమ్యం ఇస్తున్నారు. దీంతో క్రమంగా మున్నురు కాపులు బీజేపీ వైపు మొగ్గుతున్నారు.
మున్నురు కాపులు బీజేపీ వైపు ఆకర్షితులు అవ్వడాన్ని గుర్తించిన తెరాస అధినేత కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల ఏర్పడిన రాజ్యసభ ఖాళీలను ఇందుకోసం వాడుకున్నాడు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రాజీనామ చేయడం వల్ల ఏర్పడిన ఖాలీని సైతం మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన గాయత్రి రవికి కేటాయించారు. రవి నామినేషన్ నాటి సమావేశాన్ని సైతం ఏమాత్రం పార్టీ రంగు లేకుండా పూర్తిగా కుల సంఘం ఆధ్వర్యంలోనే నిర్వహించారు. దీనికి తోడు త్వరలో మున్నురు కాపు కార్పోరేషన్ సైతం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. దీని విధివిధానాల రూపకల్పన సైతం మొదలైనట్లు సమాచారం. ఇక తమ పార్టీకి చెందిన కొండ దేవయ్యను మున్నురు కాపు కుల సంఘల ఐక్య వేదిక అధ్యక్షున్ని చేశారు.
తమకు నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్న మున్నురు కాపుల మద్దతును కాంగ్రెస్ పార్టీ క్రమంగా కోల్పోతోంది. ఇప్పటికే రెడ్డిల పార్టీగా పేరు ఉన్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాపులకు మరింతగా దూరమైంది. సకల జనుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో మున్నురు కాపులు 18శాతం ఉన్నారు. ఆంధ్ర సెట్లర్ కాపులు ఇందుకు అదనం. ఇటీవల ఆంధ్ర, తెలంగాణ.. కాపు.. మున్నురు కాపు అన్న తారతమ్యాలు లేకుండా ఇరువర్గాలు కలిసిపోతున్నాయి. సమిష్టిగా ఒకే సంఘంగా ఏర్పడుతున్నారు. ఇద్దరిని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో 25శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఇంతటి కీలకమైన మున్నురు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడింది అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా తేరుకుని.. నష్ట నివారణ చర్యలు చేపడితే తిరిగి మున్నురు కాపుల నమ్మకాన్ని, ఓట్లను పొందగలుగుతుంది.