12 నెలల్లో తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్
తెలంగాణ ఏర్పడినప్పుడు రూ. 69 వేల కోట్ల అప్పు
7 ఏళ్లలో రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్
తెలంగాణలో శ్రీలంక పరిస్థితులు
ప్రజలు తిరగబడే దుస్థితి కల్పించారు
త్వరలో వైద్యం, విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్లు
మీట్ ది ప్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి 30 రోజుల్లో రైతులకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ హామీ అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామన్నారు. సబ్బండ వర్ణాల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోందని.. వారిని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు. గతంలో పంటల వైవిధ్యంతో కళకళలాడిన తెలంగాణ వ్యవసాయం.. నేడు అధ్వాన్నంగా తయారైందని, కేసీఆర్ అసమర్థ విధానాలే దీనికి కారణమని ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ లో తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడిన రోజు.. రాష్ట్ర అప్పులు రూ. 69 వేల కోట్లుగా ఉండేదని, రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. అలాంటి ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీశారని విమర్శించారు. ఈ 7 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. మిగులు బడ్జెట్ కాస్త లోటు అయ్యిందని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంకలో రాజపక్సే కుటుంబం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసినట్లుగానే.. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, దివాలా తీసే దుస్థితికి తీసుకువచ్చిందని ఆరోపించారు. శ్రీలంకలో పాలకులపై ప్రజలు తిరిగబడినట్లుగానే.. తెలంగాణలోను కుటుంబ పాలనపై ప్రజలు దుమ్మెత్తిపోసే పరిస్థితులు కల్పించారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
విభిన్న పంటల సాగుకి అనుకూలమైన తెలంగాణ రాష్ట్రాన్ని.. కేసీఆర్ తన అసమర్థ విధానాలతో ఆగమాగం చేశారని రేవంత్ విమర్శించారు. NCRB నివేదిక ప్రకారం తెలంగాణలో ఈ 7 ఏళ్లలో 8,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, సగటున ఏడాదికి వెయ్యి మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు. వ్యవసాయంపై కేసీఆర్ పూటకో ప్రకటనతో… చెరకు, కందులు, పత్తి, జొన్న తదితర పంటలు మాయమై, రైతులంతా వరికే పరిమితమియ్యారని పేర్కొన్నారు. కోటి ఎకరాలకు నీరు ఇస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే రాష్ట్రవ్యాప్తంగా ఇంకా రైతులు 30 లక్షల పంపుసెట్లతో ఎందుకు పంటలు పండిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరిట రూ. 2 లక్షల కోట్లు కేసీఆర్ దోచుకున్నారని రేవంత్ ఆరోపించారు.
కాంగ్రెస్ మాట ఇస్తే.. నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో రైతుల రుణాలను మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమన్నారు. బలహీన వర్గాలకు భూములు ఇచ్చి, వారిని భూ యజమానులగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. దేశంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీనే కట్టిందని.. తెలంగాణలో ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పూర్తి చేసినవే అని వివరించారు. పంటలకు కనీస మద్దతు ధరల విధానాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కేసీఆర్ పాలనలో అవస్థలు పడుతున్న రైతులని ఆదుకునే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్ తరహాలో త్వరలో వైద్యం, విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్లు ప్రకటిస్తామని తెలిపారు.