అమిత్ షాకు రేవంత్ రెడ్డి 9 ప్రశ్నలు
టీబీజేపీ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తోన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తోన్న కేంద్ర బీజేపీ నాయకత్వం.. ఎవరిపై పోరాటం చేసేందుకు రాష్ట్రానికి వస్తున్నారని నిలదీశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తోడుదొంగలై.. పంటల బీమా పథకాన్ని నీరుగార్చారని విమర్శించారు.
అమిత్ షాకు రేవంత్ ప్రశ్నలు..
- ప్రాజెక్టుల రీడిజైనింగ్.. కాళేశ్వరం పేరిట సీఎం కేసీఆర్ కమిషన్లు దండుకున్నారని మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం. 8 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా ?
- తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, భాజపా చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడిచిన వానాకాలం నుంచి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా ?
- గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం . మీరు స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న సందర్భం గా మీరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి , తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుం దనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మ గౌరవం , ఆత్మాభిమానం లేదని మీరు భావిస్తున్నారా?
- మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ పార్టీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆ మేరకు ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్ ప్రజలు అర్వింద్ ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసేలేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా ?
- తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. మీకు మా ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలి ? విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు ?
- అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా “రామాయణం సర్క్యూట్” పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. 7,500 కి.మీ. సాగే ఈ సర్క్యూట్ లో భద్రాద్రి రాముడికీ చోటు దక్కలేదు. అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా ?
- ఒడిశాలోని నైనీకోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం . ఇంత వరకూ దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్ గా ఉంటే.. అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు ?
- పొరుగున ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. మీ దుర్మార్గ చట్టాలకు తెరాస మద్దతు.. వారి అక్రమాలు అవినీతికి మీ మద్దతు.. ఇదే కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది ?
- 2014లో కాం గ్రెస్ అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు. గ్యాస్ సిలిండర్ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి ఎగబాకాయి. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి?’’
పై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలంగాణకు ఏ మొహం పెట్టుకొని వస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల మనోభావాలతో ఆడుకుని, రాజకీయ ప్రయోజనం పొందాలనే మీ కుతంత్రం ఇక్కడ పని చేయదని అన్నారు.