భారత దేశం మొత్తం అప్పు రూ. 135.87 లక్షల కోట్లు
స్వాతంత్రానంతరం 67 ఏళ్లలో రూ. 55 లక్షల కోట్ల అప్పులు
మోదీ హయాంలో ఈ 8 ఏళ్లలో రూ. 80 లక్షల కోట్ల అప్పులు
ఏటా సగటున రూ. 10 లక్షల కోట్ల రుణాలు
అప్పుల్లో ప్రపంచ రికార్డు దిశగా ప్రధాని మోదీ
పన్నుల వసూళ్లలోనూ తగ్గేదిలే అంటున్న కేంద్రం
పెట్రో బాదుడే రూ. 3 లక్షల కోట్లు
లక్షల కోట్ల రుణాలు, పన్నుల వసూళ్లు ఏం చేస్తున్నట్లు ?
స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసిన మొత్తం అపులు… రూ. 55,87,149 కోట్లు. బూటకపు వాగ్దానాలతో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. అప్పటి నుంచి 2022 వరకు చేసిన అప్పులు రూ. అక్షరాలా.. రూ.80,00,744 కోట్లు. అంటే… 67 ఏళ్లలో దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పులు కంటే… కేవలం 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువ. ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దేశాన్ని అప్పులకుప్పగా మార్చేసింది. గడిచిన 8 ఏండ్లలో ఏటా సగటున రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. గతంలో పనిచేసిన 13 మంది ప్రధాన మంత్రులను మించి ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్రమోదీ సొంతం చేసుకున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై పన్నులు, సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే.. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను కడుతున్నామంటూ ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొంటున్నారు.
మోదీ ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో చేసిన 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యాలేంటి ? దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాదిరాళ్లు తమ పేర్లతో వేసుకొన్నారు. వాటికి నిర్దేశించిన గడువు కూడా తీరిపోయింది. ఒక్క తట్టెడు పని కూడా జరుగలేదు. దేశవ్యాప్తంగా కేంద్రం ఆధ్వర్యంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు కూడా కట్టలేదు. చెప్పుకోదగ్గ పేదల పథకాలు లేవు. సంక్షేమానికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారా అంటే… అదీ లేదు. పోనీ పేదలు, రైతులకి సబ్సిడీలు అందిస్తున్నారా అంటే.. యూపీఏ సర్కార్ ఘనంగా అమలు చేసిన సబ్సిడీలను మోదీ ప్రభుత్వం మూలన పడేసింది.
ఏటా 83 వేల కోట్లెక్కడ.. నెలకి 83 వేల కోట్లెక్కడా ??
ప్రధానిగా నరేంద్రమోదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అప్పు రూ.55.87 లక్షల కోట్లు. అంటే.. స్వాతంత్య్రం అనంతరం 67 ఏండ్లలో ప్రభుత్వాలు ఏటా సగటున రూ.83,388 కోట్లు అప్పు చేశాయన్నమాట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.135.87 లక్షల కోట్లు. అంటే మోదీ తన ఎనిమిదేండ్ల పాలనలో రూ.80 లక్షల కోట్లు అదనంగా అప్పులు చేశారు. సగటున ఏటా రూ.10 లక్షల కోట్లు అన్నమాట. ఈ లెక్కన ప్రతి నెల మోదీ ప్రభుత్వం తీసుకొన్న సగటు రుణం రూ.83,341 కోట్లు. గతంలో పనిచేసిన 13 మంది ప్రధాన మంత్రులు సగటున ఏటా రూ.83 వేల కోట్లు అప్పులు చేస్తే, మోదీ ఏకంగా నెలకే రూ.83 వేల కోట్లు రుణం తీసుకొన్నారు. ఈ ఏడాది మరో 17 లక్షల కోట్ల అప్పు తీసుకోవడానికి మోదీ సర్కారు ప్లాన్ చేసింది. దీంతో లక్షన్నర లక్షల కోట్లకు మన అప్పు చేరుతుంది. భారత్ అప్పుల్లో కనీవినీ ఎరుగని భారీ రికార్డు సృష్టించబోతున్నదన్నమాట!
పెట్రో బాదుడు.. నాలుగు రెట్లు
దారుణంగా అప్పులు చేస్తున్నది కదా.. కనీసం ప్రజలకు పన్నుల్లో ఉపశమనం కలిగిస్తుందా అంటే అదీ లేదు. దేనికదే లెక్క అన్నట్టు మోదీ సర్కారు వ్యవహరిస్తున్నది. ప్రజలపై పన్నుల భారం మోపడంలోనూ బీజేపీ ప్రభుత్వానిదే రికార్డు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక్క రూపాయి ధర పెరిగినా.. సామాన్యుడిపై కనీసం రెండు రూపాయల భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నుల భారం మోపింది. మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు రూ.74,158 కోట్లు చేరాయి. 2020-21కి వచ్చేనాటికి ఈ మొత్తం ఏటా రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తంగా ఈ ఏడేండ్లలో రూ.16.7 లక్షల కోట్లు వసూలు చేసింది. అంటే ఏటా సగటున రూ.2.38 లక్షల కోట్లను ప్రజల జేబుల నుంచి గుంజుకొన్నది. 2014లో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో పెట్రోల్, డీజిల్‌పై వచ్చిన పన్నుల వాటా 5.4 శాతంగా ఉండగా, 2020-21 నాటికి అది 12.2 శాతానికి పెరింగింది. నేడు ఒక్క వంటగ్యాస్ సిలిండర్‌కు పెడుతున్న ఖర్చుతో మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు రెండు సిలిండర్లు వచ్చేవంటే రేట్లు ఏ స్థాయిలో ధరలు పెంచారో అర్థం చేసుకోవచ్చు.