-ప్రజాదర్బార్ లు లేవు, గోడు వినే నాథులు లేరు
- కేసీఆర్ సచివాలయానికి రాడు, ప్రగతి భవన్ కు రానివ్వడు
-అర్జీ తీసుకోడు.. ధర్నాచౌక్ లో అరవనివ్వడు
-ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం కరవు
-నిజంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా..?
రాజుల కాలంలో అంతఃపురం వద్ద ధర్మగంట ఉండేది. అక్కడికి వెళ్లి… ఎవరైనా ధర్మగంట మోగిస్తే… ప్రభువైన రాజు బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే వారు. ధర్మగంట మోగిందంటే.. నిద్రలో ఉన్నా.. మేల్కొని.. బయటకు రావడం… జనం గోడు వినడం.. ఆనాటి రాజుల విధ్యుక్త ధర్మం. పాలన ఏ రూపంలో ఉన్నా.. జనం తమ బాధలు చెప్పుకునే ఒక వ్యవస్థ ఉండేది… ఉంటుంది… ఉండాలి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… పాలకులే సేవకులు. ప్రభువులు ఆదేశిస్తే పాలకులు తమ కర్తవ్యం నిర్వర్తించాలి. సేవకులు విధులు నిర్వర్తించకుంటే.. ప్రభువులు ఏం చేయాలి..? ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి తప్ప.. ప్రజలే స్వయంగా పాలకుల్ని మధ్యలో దింపే వ్యవస్థ లేదు. మరేం చేయాలి….? గోడు వినకుంటే… గొంతెత్తి అరిచినా పట్టించుకోకపోతే ఏంటి గతి..? జనం వేదన అరణ్యరోధనగా మారితే ఎలా ఉంటుంది….? సరిగ్గా తెలంగాణలో అలాగే ఉంది.
ప్లకార్డు పట్టుకుంటే నేరం.. ప్రశ్నిస్తే ద్రోహం
ఇటీవల 10 రోజుల క్రితం… ప్రగతి భవన్ ముందు ఒక అప్రజాస్వామిక, హృదయవిధారక ఘటన జరిగింది. దేవరకొండకు చెందిన ఓ కుటుంబం తమ గోడు వెల్లబోసుకోవడానికి వచ్చింది. “అయ్యా.. ఎనిమిది నెలల కింద.. మా కొడుకును ఎవరో చంపేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదు. సీఎంను కలిసి వినతిపత్రం ఇద్దామని వస్తే… మమ్మల్నే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.” అని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే పోలీసు వ్యవస్థ… ఆ కుటుంబాన్ని 8 నెలలుగా స్టేషన్ల చుట్టూ తిప్పకుంది. అప్పుడు వాళ్ల విధులు గుర్తురాలేదు. కానీ.. దొర ఇంటి ముందు ఓ కుటుంబం కన్నీరు పెట్టుకుంటే.. కష్టం చెప్పుకుంటే.. అది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనగా కనిపించింది. అందుకే వాళ్లను అక్కడి నుంచి తరలించారు. అంతే కదా..!
గతి లేని ప్రగతి భవన్.. దిక్కు లేని జనం
నిన్ననే కాదు.. ప్రగతి భవన్ ముందు ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం. ఎవరో ఒకరు రావడం… “అయ్యా ఇదీ మా దుస్థితి” అని కన్నీరుమున్నీరుగా విలపించడం… పోలీసులు వాళ్లను కుక్కల్లా ఈడ్చుకెళ్లడం… వ్యాన్లలో పడేసి, స్టేషన్ కు తరలించడం.. అక్కడ రోజూ అదే పరిస్థితి. నిరుద్యోగులు, తొలగింపునకు గురైన ఉద్యోగులు, రైతులు, ప్రజల సమస్యలు పరిష్కరించాలని వెళ్లిన ప్రతిపక్ష నేతలు… ఎవరైనా… అక్కడికి వెళ్లడం పెద్ద తప్పయిపోయింది. ప్రగతి భవన్ అంటే.. జనాలకు నిషేధిత ప్రాంతమైపోయింది. అసలదేంటి…? తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం. అంటే.. విధులు నిర్వహిస్తూ నివాసముండే ఇల్లు. ప్రజలు అర్జీ పట్టుకుని వస్తే తీసుకోవడం సీఎం విధుల్లో భాగం కాదా..? ఎవరైనా అక్కడికి వచ్చి ప్లకార్డు పట్టుకుంటే నేరమా..? ప్రజలు తాము ఎన్నుకున్న సేవకుడి వద్దకు వచ్చి… ఇదిగో ఈ పని చేయు అని బాజాప్తా అడుగుతున్నారు. అది నేరమెట్లయితది..?
బార్లు పెడుదాం.. దర్బార్లెందుకు మనకు..?
కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించేవారు. ఉదయమే రోజుకు కనీసం 3 గంటలైనా ప్రజల విన్నపాలు వినేవారు. ప్రజలు క్యూలో నిల్చుకుని ఇదీ బాధ అని అర్జీ ఇస్తే.. సమస్య పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు సీఎంలు ఆదేశించేవాళ్లు. మంత్రులు అందుబాటులో ఉండేవాళ్లు. సచివాలయం ముందు ఎప్పుడూ పెద్ద క్యూ ఉండేది. అక్కడ వినతి పత్రాలు తీసుకోవడానికి కౌంటర్ ఉండేది. తీసుకున్న వినతిపత్రాల్ని.. సంబంధిత శాఖలకు పంపించేవాళ్లు. కానీ.. నేడు ఏమైంది..? ప్రజాస్వామ్యం పోయి… నియంత పాలన ఏమైనా వచ్చిందా..? పాలకులు చెప్పింది జనం వినడమే కానీ.. జనం గోడు పాలకులు వినే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది…?
తుగ్లక్ విధానాలు.. హిట్లర్ పోకడలు
ప్రగతి భవన్ ముందుకు ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు. సచివాలయం అసలే లేదు. ఉన్న సచివాలయాన్ని కూల్చేసి, కొత్తది కడుతున్నారు. టెంపరరీగా అధికారులు పని చేసుకునేందుకు బీఆర్కే భవన్ లో ఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. కానీ.. అక్కడికి ఎవరూ వెళ్లడానికి అనుమతి లేదు. పాలన తీరును ప్రజలకు వివరిద్దామని వెళ్లే జర్నలిస్టులకు కూడా అక్కడ చోటు లేదు. సచివాలయమేమో లేదు. ప్రగతి భవన్ ముందు ప్లకార్డు పట్టుకున్నా అరెస్టు చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామిక తెలంగాణ..? ఆవేదన చెప్పుకోవడానికి కూడా వీల్లేదా…? సీఎం నేరుగా వినతిపత్రం తీసుకోకపోయినా ఫర్లేదు… కనీసం ప్రగతి భవన్ లో ఓ అధికారి ద్వారానో… అటెండర్ ద్వారానో అయినా వినతి పత్రాలు తీసుకోవచ్చు కదా….! ఇందుకు ఎవరు అడ్డు పడుతున్నరు…?
ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితది..?
తెలంగాణ ఇప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ కానేకాదు. ఇది విమర్శ కాదు.. ఆరోపణ అసలే కాదు. సామాన్యులు ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరికి వెళ్లి.. గోడు చెప్పుకుంటే పనులు కావట్లేదు. “మా గోడు చెప్పుకోవాలె సారూ.. జర సీఎం సారు దగ్గరికి మీరు పోయేటప్పుడు వెంట తీస్కపోండ్రి” అని ఎవరైనా అడిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు మొహం పక్కకు తిప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నరట. “సారును మేం సూడకనే యాడాదైంది. మీకేడికెళ్లి సూపిస్తం.” అని అంటున్నరట. అధికారులైనా.. మంత్రులైనా… ఎమ్మెల్యేలైనా.. సారు పిలుస్తేనే ప్రగతి భవన్ కు పోవాలె. సారు తీస్కపోతేనే ఫామ్ హౌజుకు పోవాలె. సరే.. సచివాలయం ఎట్లాగూ లేదు. ఉన్నా అక్కడికి సారు రాడు. “నేను ఏడుంటే అదే నా ఆఫీసు. పాలన నడుస్తలేదా..?” అంటడు పెద్ద సారు. నువ్వు లేకపోయినా పాలన ఆగది మరి… నువ్వెందుకు…? అని జనం అడిగితే ఏం చెబుతడట సారు..?
నష్టం లేదా.. కష్టం కాదా..?
“అవును నిజమే… ఎమ్మెల్యేలు మంత్రుల్ని కలవకపోతే… మంత్రులు ముఖ్యమంత్రిని కలవకపోతే వచ్చే నష్టమేందట…! సీఎం ఎక్కడ ఉన్నా పాలన నడుస్తనే ఉంది… కష్టమేముంది…?” అని దొర బానిసలకు బానిసలు అడుగుతరు. అవును.. నష్టం ఉంది… కష్టం ఉంది. ఎట్లంటే… ఏదో ఒక ఊరిలో ఒకరికి ఏదో కష్టమొచ్చింది. అత్యవసరంగా సీఎంను కలిసి అర్జీ ఇచ్చుకుంటే పని అవుతుంది కావొచ్చు… ఓ ప్రాణమో, కొన్ని ప్రాణాలో నిలిచే పరిస్థితే ఉంటుంది కావొచ్చు. వాళ్లు లోకల్ లీడర్ ను వెంట పెట్టుకుని ఎమ్మెల్యే దగ్గరికి పోతరు. ఎమ్మెల్యే మంత్రి దగ్గరికి తీసుకపోతడు. మంత్రి సచివాలయానికి వచ్చినప్పుడు… సీఎం ఉంటే డైరెక్టుగా కలిపిస్తడు. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా అంచెల వారీ వ్యవస్థ లాగా పాలన నడువాలె. కానీ… నేడు ఆ పరిస్థితి ఉందా…? లేకపోవుడు నష్టం కాదా..? కష్టం కాదా..?
నీ పాలనలో వాస్తు సంగతేంది సారూ..?
బిల్డింగులకు వాస్తు సక్కగ లేకపోతే తనకు అరిష్టమని నమ్మే కేసీఆర్… పాలనలో వాస్తు లేకపోతే అరిష్టం కాదా…? సమాధానం చెప్పాలె. ధర్నా చేసుకునేందుకు ధర్నా చౌక్ లేకుండా చేస్తడు… ప్రగతి భవన్ ముందుకు రానివ్వడు. తెలంగాణలో బాధ కలిగితే గట్టిగా అరిచే హక్కు లేదు… అర్జీ తీసుకునే దిక్కు లేదు. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితది…? ఇదంతా ఎవరి వల్ల అయిందో తెలుసుకుని, తెలంగాణ మేల్కోకపోతే…. ఇంకా ఎన్ని అరిష్టాలు చూడాల్సి వస్తదో…. జాగో తెలంగాణ.