ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగురుద్ది
–రాహుల్ రైతు సంఘర్షణ సభ సభతో సునామీ సృష్టిస్తాం..
-టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం..
-రైతుల జీవితాలతో టీఆర్ఎస్, బీజేపీ చెలగాటం..
-వడ్ల కొనుగోలుపై డ్రామాలు ఆడుతున కేసీఆర్..
-నాగార్జునసాగర్ సభలో నిప్పులు చెరిగిన రేవంత్..
వరంగల్ లో మే 6న జరగనున్న రాహుల్ గాంధీ “రైతు సంఘర్షణ సభ” ద్వారా కాంగ్రెస్ రైతు సునామీని సృష్టిస్తుందని.. ఆ సునామీలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీల బాగోతాలను వివరించి, రైతుల ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా .. రైతు సంఘర్షణ సభ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై.. కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వరి వేయద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, తన ఫౌం హౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో ఎందుకు సాగు చేశారో రైతులకి చెప్పాలని నిలదీశారు.
వడ్ల కొనుగోలుపై డ్రామాలు ఆడుతున్న కేసీఆర్
రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2,300 మాత్రమే తెరిచారు. 17 కోట్ల గోనె సంచులు అవసరం కాగా, ప్రభుత్వం మాత్రం 8 కోట్ల బస్తాలకు టెండర్లు పిలిచింది. వాటికి కూడా టెండర్లు దాఖలు చేసే వాళ్లే దిక్కులేరు. ఎందుకంటే.. గతంలో సరఫరా చేసినవాళ్లకి ఇప్పటి వరకు వందల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. నూక ద్వారా వచ్చే నష్టం భర్తీపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో మిల్లర్లు వడ్ల లోడ్ లను దించుకోవడం లేదు. రాష్ట్రంలో రెండు రోజుల నుంచి అకాల వర్షాలు పడుతున్నాయి. కళ్లాల్లో వడ్లు పోసిన రైతులకి కనీసం టార్ఫాలిన్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలన కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కుంటో్న ఈ కష్టాలన్నింటినీ రాహుల్ గాంధీకి వివరించాం. తెలంగాణ ఇచ్చింది మనం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సింది కూడా మనమే అని చెప్పాం. అన్నదాతల కోసం జరిగే వరంగల్ సమావేశానికి ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక్కరు హాజరై.. వరంగల్ లో జన సునామీ సృష్టిద్దాం. పోరాటాల పురిటిగడ్డయిన నల్గొండ నుంచే లక్షన్నర మంది వరంగల్ సభకు హాజరవుతారన్న విశ్వాసం ఉంది” అని అన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా గురించి మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో ఉన్న నీటి ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ కట్టినవే అని, టీఆర్ఎస్ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ప్రాజెక్టుల్లో 90 శాతం పనులు కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. జానారెడ్డి శాసనసభలో లేకపోవడం వల్ల చట్టసభ గౌరవం కోల్పోయిందని ఆవేదవ వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా, భూ కబ్జాలు, దందాలు చేస్తున్నారని విమర్శించారు. వారందరికీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుందని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 సీట్లని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సన్నాహ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానా రెడ్డి, గీతారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహా జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.