అందరూ ఆశ్చర్యపోయేసేలా కేసిఆర్ గారు కేంద్రంపై పోరాడేశారు. తన పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో ధర్నాలు చేసి రాష్ట్రాన్నీ, డిల్లీనీ దద్దరిల్ల చేశారు. చివరాఖరికి ఏమైంది?
“తెలంగాణా రాష్ట్రం నుండీ పార్ బాయిల్డ్ రైస్ తీసుకోలేమ్. ముడి బియ్యం ఎంతైనా తీసుకుంటాం” అని ఎఫ్సిఐ ఇంతకాలం చెబుతూ వచ్చింది. “మా రాష్ట్రం నుండీ పార్ బాయిల్డ్ రైస్ ఇవ్వము. ముడి బియ్యమే ఇస్తాము ,మొత్తం తీసుకోవాలి” అని తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎఫ్సిఐ కి ఉత్తరం రాసింది. అంటే ఎప్పటి లాగానే రాష్ట్రం ధాన్యం సేకరిస్తుంది. మిల్లర్లు మిల్లింగ్ చేస్తారు. ఎఫ్సిఐ బియ్యం తీసుకుంటుంది. తెరాస పార్టీ ముందుకు తెచ్చిన నూతన జాతీయ ప్రొక్యూర్మెంట్ పాలసీ, బియ్యం కాకుండా ధాన్యమే ఎఫ్సిఐ కొనాలనే డిమాండూ పక్కకు పోయాయి.
ఇది తమ విజయం అంటే, తమ విజయమని జబ్బలు చర్చుకోవడానికి బిజేపి ,టిఆర్ఎస్ పార్టీలు ఈ రెండు నెలల్లో ఏమి సాధించాయో, ఇరు వైపులా చెబుతున్న అబద్దాలు అర్థం చేసుకోలేక ఇంతకాలం గందరగోళంలో పడిన ప్రజలకు ఇప్పుడు అర్థం కావడం లేదు . సేకరణ కేంద్రాలు సకాలంలో తెరవక ఎంఎస్పి కంటే తక్కువ ధరకే ధాన్యం అమ్ముకుని, వ్యాపారుల దోపిడీకి బలైన రైతులకు, వాళ్ళు రాజకీయంగా విజయం సాధిస్తే , తాము మార్కెట్ లో ఎందుకు ఓడిపోయామో అసలు అర్థం కావడం లేదు.
అర్థమైన వారికి మాత్రం ఒక విషయం స్పష్టంగా రుజువైంది . పాము బయట ఎన్ని మెలికలు తిరిగినా, ఎంతగా బుసలు కొట్టినా , పుట్టలోకి వెళ్ళేప్పుడు మాత్రం స్ట్రైట్ గానే వెళుతుంది. బీజీపీ తో తెరాస పోరాటం అంతిమంగా రాజీలతోనే ముగుస్తుంది. ఈ లోపు వీలైనంత రాజకీయ వీధి నాటకాలతో రక్తి కట్టించడం, ఒకరినొకరు రాజకీయంగా ఆత్మరక్షణ లోకి నెట్టుకోవడం ద్వారా, ఒకరిపై మరొకరు ఎన్నికల నాటికి ప్రజలలో ఆధిపత్యాన్ని సాధించడం ఇరువురి లక్ష్యం.
చాలా మందికి కేసిఆర్ ఇక వెనక్కు రాలేనంతగా బీజీపీ పై పోరాటంలో ముందుకు వెళ్లిపోయారనే భ్రమలు ఉన్నాయి కానీ , నిజానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి , వేరెవరికీ అవకాశం ఇవ్వకూడదనే స్వంత పార్టీ రాజకీయ తపన తప్ప , నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కాదిది. అలా చేసి ఉంటే బీజీపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను కత్తిరిస్తూ, రాష్ట్ర పరిధిలోని అంశాలలోకి జొరబడుతూ , ఎన్నో విధాన నిర్ణయాలు ఇప్పటికే చేసింది. చేస్తున్నది .
జిఎస్టి పేరుతో , పన్నులపై ఆధిపత్యమే కాదు, చివరికి అడవులపై, నదీ జలాలపై కూడా ఆధిపత్యాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నది. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కాలరాచిన ఆర్టికిల్ 370 రద్ధును సమర్ధించడం , రైతుల, రాష్ట్రాల వ్యతిరేక మూడు చట్టాలపై తన వైఖరిని పదేపదే మార్చుకోవడం, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రాష్ట్రంలోకి జొరబడి ప్రజా సంఘాల కార్యకర్తలను ఎత్తుకుపోతుంటే , UAPA కేసులు బనాయిస్తుంటే చూస్తూ కూడా మౌనంగా ఉండడం, మోడీ ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరిస్తున్నట్లు , తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనే చేయకపోవడం – ఇవన్నీ , తెరాస నిజ వైఖరినే వెల్లడిస్తాయి. పైగా ఈ 8 ఏళ్ళూ అన్ని ప్రతి పక్ష పార్టీల,ప్రజా సంఘాల ప్రాధమిక హక్కులను కాలరాసి,BJP ని నెత్తి మీదకు తెచ్చుకుంది కూడా ఈ పెద్ద మనిషే…
ఇక వరి విషయానికి వస్తే, తెలంగాణా లో వానాకాలం , యాసంగి సీజన్ లలో రైతులు వరి ధాన్యం పండిస్తున్నారు. 2014-2015 లో వానా కాలంలో స్థూల సాగు భూమిలో 22 శాతం లో మాత్రమే వరి పండించిన రైతులు 2020-2021 సంవత్సరం వచ్చే సరికి 37.1 శాతం భూమిలో వరి పండిస్తున్నారు. యాసంగిలో 2014-2015 లో స్థూల సాగు భూమిలో 43.4 శాతం భూమిలో వరి సాగు కాగా , 2020-2021 వచ్చే సరికి 76 శాతం భూమిలో వరి సాగు విస్తరించింది . ఫలితంగా మన రాష్ట్ర అవసరాలకు మించి వరి ఉత్పత్తి అవుతున్న మాట వాస్తవం.
రాష్ట్రంలో సరైన పంటల ఉత్పత్తి ప్రణాళిక చేసుకోవడం అనేది రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన బాధ్యత . రాష్ట్ర ప్రజల , పశువుల ఆహార అవసరాలు , స్థానిక వ్యవసాయాధారిత పరిశ్రమల ముడి సరుకుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళిక చేసుకోవాలి. ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో చేసుకునే ముందస్తు ఒప్పందాలను కూడా ఈ పంటల ప్రణాళిక సమయంలో దృష్టిలో పెట్టుకోవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కుంటున్నది , పార్ బాయిల్డ్ బియ్యం సమస్య కాదు. మొత్తంగానే వరి విస్తీర్ణాన్ని తగ్గించుకుని, రెండు సీజన్లూ కలిపి 50 లక్షల ఎకరాలకు పరిమితం చేసుకుని , ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాల్సిన సమస్య . 2018 లోనే నాబార్డ్ తన నివేదికలో , తెలంగాణా రాష్ట్రం, విద్యుత్ బిల్లులతో కూడిన ఖరీదైన నీళ్ళ వినియోగం రీత్యా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వరి ,పత్తి సాగు తగ్గించుకుని, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు ,కూరగాయలు సాగు చేసుకుంటే మంచిదని స్పష్టమైన సూచన చేసింది. కానీ ఈ సూచనను గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెడ చెవిన పెట్టి , రాష్ట్రాన్ని వరి వైపు నెట్టుకు పోయింది.
కేంద్రం పార్ బాయిల్డ్ బియ్యం సేకరించలేమని చెప్పడంతో, అనివార్యంగా ఈ యాసంగిలో , రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి ఒక ప్రయత్నం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత వైఖరి వల్ల, కేంద్రం పై పోరాటం పేరుతో గత నెల రోజులుగా చేసిన కార్యాచరణ వల్ల ఈ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి.
ఎప్పటిలాగే రాష్ట్రంలో పండిన వరిని ఎఫ్సిఐ కి ముడి బియ్యం రూపంలో ఇవ్వడానికి మొదట్లోనే ఒప్పందం చేసుకుని, అందుకు అవసరమైన సేకరణ ఏర్పాట్లు చేసుకుని ఉంటే , రైతులకు మేలు జరిగేది. తన దృష్టి అంతా ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుల మీద పెట్టి, వారికి కూడా ఎంఎస్పి వచ్చేలా చూస్తూ, అవసరమయితే కొన్ని పప్పు ధాన్యాల, నూనె గింజల , చిరు ధాన్యాల పంటలు తానే సేకరిస్తూముందుకు వస్తే , ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు కూడా ఒక భరోసా ఉండేది. వాళ్ళు ధైర్యం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసినందుకు లాభం జరిగేది . కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ప్రత్యామ్నాయ పంటలకు వ్యాపారులు ఎంఎస్పి ఇవ్వడం లేదు.
ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పోరాటం అంతా నిజంగా వరి రైతుల కోసం చేసిందా ? బడా రైస్ మిల్లర్ల లాబీ కోసం చేసిందా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిల్లింగ్ అనేది ఒక వ్యాపారం. పైగా ఈ మిల్లర్లూ బియ్యం వ్యాపారంలో కూడా మునిగి ఉన్నారు. మిల్లింగ్ లో వచ్చే ఉప ఉత్పత్తుల వ్యాఫారంలో మునిగి ఉన్నారు . కోట్ల పెట్టుబడులు పెట్టే స్థితిలో ఉన్న వున్న “పెద్దవాళ్ళు “. ఇంత కాలం నాణ్యత పేరుతో రైతులకు కోతలు పెట్టీ , ఊక, నూకలు, తవుడు, పరమ్ లాంటి ఉత్పత్తులను అమ్ముకునీ , ఎఫ్సిఐ రూపొందించిన దిక్కుమాలిన నాణ్యతా ప్రమాణాలను అడ్డం పెట్టుకుని , కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరుతో ప్రజలు తినడానికి పనికి రాకుండా నానా చెత్తా ఎఫ్సిఐ కి అంట గట్టీ, రేషన్ బియ్యం రీ సైక్లింగ్ ద్వారా కోట్ల రూపాయల లాభాలు గడించారు. ఒప్పందం ప్రకారం ఎఫ్సిఐ కి ఇవ్వాల్సిన బియ్యం కూడా పూర్తిగా ఇప్పటికీ ఇవ్వనే లేదని ఎఫ్సిఐ అంటోంది.
పారా బాయిల్డ్ ఒద్దంటే ఈ సంవత్సరం నూకలు ఎక్కువ వచ్చి , రైస్ మిల్లర్లు నష్ట పోతారని , మొత్తం ప్రభుత్వ పెద్దలు గగ్గోలు పెట్టి రంగంలోకి దిగి పోయారు . క్వింటాలు ధాన్యం పట్టిస్తే 35 కిలోలే బియ్యం వస్తాయి కనుక , రైస్ మిల్లర్లు, నష్ట పోకుండా , 3500 కోట్లయినా ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో రెండు సార్లు నొక్కి చెప్పారు . రైస్ మిల్లర్లకు ఎంత నష్టం వస్తుందో అంచనా వేయడానికి , ఐఏఎస్ అధికారుల కమిటీని కూడా వెంటనే నియమించారు. ఇందులో కమీషన్లు , కుంభకోణాలు నిండి ఉంటాయని వేరుగా చెప్పనక్కర లేదు.
నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే, మిల్లింగ్ ఛార్జీలే మిల్లర్లకు పెంచి చెల్లించి , ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి తెచ్చి , మొత్తం ఉప ఉత్పత్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. నూకలను ఇథనాల్ పరిశ్రమకు అమ్ముకోవచ్చు, తవుడును పశు సంవర్ధక శాఖ ద్వారా రైతులకు సబ్సిడీపై అందించవచ్చు. యాసంగిలో బియ్యం రికవరీ తక్కువ ఉంటుంది కాబట్టి, ఆ మేరకు అందించాల్సిన బియ్యం పరిమాణం తగ్గించాలని ఎఫ్సిఐ ని కోరి ఒక ఒప్పందానికి రావచ్చు. ఇకపై యాసంగిలో వరి ఎక్కువ వేయకుండా , అవసరమైన వరి, ఖరీఫ్ లోనే పండించుకోవచ్చు.
ప్రతి సంవత్సరం ఎంఎస్పి ప్రకటించే సిఏసిపి సంస్థ అంచనా ప్రకారం తెలంగాణాలో 2021-2022 సంవత్సరానికి వరి ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు ( సి2) క్వింటాలుకు 1839 రూపాయలు అని చెప్పింది. ఈ ఖర్చు ఆధారంగా స్వామినాథన్ కమీషన్ సిఫారసుల ప్రకారం ప్రకటించాల్సిన ఎంఎస్పి 2719 రూపాయలు. కానీ ప్రకటించిన ధర క్వింటాలుకు 1960 రూపాయలు. అంటే ప్రతి సీజన్లో ప్రతి క్వింటాలుపై తెలంగాణా రైతులు 750 రూపాయలు నష్టపోతున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు 2738 రూపాయలు. ఖర్చు పరం గానే రైతులు క్వింటాలుకు నికరంగా 778 రూపాయలు నష్ట పోతున్నారు . ఎకరానికి 20 క్వింటాల్ల పంట పండితే రైతులకు న్యాయమైన ధర రాక కనీసం 15,000 రూపాయలు నష్టం జరుగుతున్నది . మరి ఎప్పుడైనా , ఈ ప్రభుత్వం ఈ నష్టాన్ని రైతులకు పూడ్చడానికి ఇంత ఆతృత పడిందా ? నష్ట పరిహారం చెల్లించడానికి సిద్దపడిందా? ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు బోనస్ అందించడానికి,లేదా ఎంఎస్పి ఇవ్వడానికి సిద్దపడిందా?
రాష్ట్రంలో ప్రజాస్వామిక దృక్పథం, పర్యావరణ స్పృహ , సామాజిక న్యాయ కోణం ఏ మాత్రమూ లేని ప్రభుత్వ పాలన వల్ల రైతులు, ఇతర పేదలు ఎప్పటికప్పుడు సంక్షోభంలో పడుతున్నారు. విషయాలను సరిగా అర్థం చేసుకుంటూ, ఈ నిరంకుశ, నిర్లక్ష్య పోకడలను ఎదిరించడానికి ప్రజలు సిద్దపడినప్పుడే పాలకుల ఈ ధోరణి మారుతుంది.