తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పూర్తిగా ధ్వంసమైన రంగం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ విద్యారంగమే. ప్రభుత్వ విద్యకు సర్కార్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విద్యాశాఖపై కేసీఆర్ పెద్దగా సమీక్షలు చేసిన సందర్భాలు కూడా లేవు. మన ఊరు – మన బడి పేరుతో పైపెచ్చు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రయత్నించారు కానీ విద్యాశాఖలో పోస్టుల భర్తీకి మాత్రం చర్యలు చేపట్టడం లేదు.
టీచర్ పోస్టుల నుంచి మొదలుకొని జిల్లా పాఠశాలలను పర్యవేక్షించే డీఈవోల వరకు అన్ని పోస్టులు ఖాళీలే ఉన్నాయి. పాఠశాల విద్యపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. హెచ్ఎంలు, ఎంఈవోలు, డీఈవోల పోస్టులను దాదాపుగా ఇంచార్జ్ లతోనే నడిపిస్తున్నారు. వాస్తవానికి ప్రతి జిల్లాకు ఓ డీఈవో చొప్పున తెలంగాణలోని 33జిల్లాలకు 33మంది డీఈవోలు ఉండాలి. కాని ఏడుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం 33జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం డీఈవో పోస్టులను పెంచిన జిల్లాల ఆధారంగా మంజూరు చేయలేదు. అంతేకాదు డిప్యుటీ డీఈవో పోస్టులు 66ఉండగా అందులో అరవై పోస్టులు ఖాళీగానే ఉండటం గమనార్హం.
615 మండలాలకు 17మంది మండల విద్యాశాఖ అధికారులు(ఎంఈవో)లు ఉన్నారు. 95శాతం ఇంచార్జ్ ఎంఈవోలే కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల ప్రధానోపాద్యాయులను ఇంచార్జ్ ఎంఈవోలుగా కొనసాగిస్తున్నారు. ఒక్కో అధికారికి ఆరు , ఏడు మండలాలను కేటాయించి మండల విద్యాశాఖ బాధ్యతలను చేసుకోమని చెప్తున్నారు. తెలంగాణలోని 85 మండల్లాలోనే ఒక మండలానికి ఒక ఎంఈవో (ఇన్‌ఛార్జి) ఉన్నారు. మిగిలిన మండలాల్లో ఒక్కో అధికారికి ఎనిమిది మండలాలను కేటాయిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు కట్టబెట్టడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఎంఈవోలు, ఇటు స్కూల్ లో హెచ్ఎంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులకు సరైన బోధనా అందాలంటే టీచర్ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా పాఠశాల విద్యాశాఖలోని పర్యవేక్షణ అధికారుల పోస్టులను కూడా భర్తీ చేయాలి. కానీ సర్కార్ మాత్రం ఆ పని చేయడం లేదంటేనే విద్యా వ్యవస్థపై ప్రభుత్వం చిత్తశుద్ది ఏంటో అర్థం చేసుకోవచ్చు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి గొర్రెలు, బర్రెలు ఇచ్చే ప్రభుత్వం విద్యావ్యవస్థకు మాత్రం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను పట్టాలెక్కించడం లేదు.