మనిషి జీవితంలో మొబైల్ ఓ భాగమైంది. మొబైల్ పక్కనపెట్టి కాసేపు కూడా ఉండలేకపోతున్నారు. మనిషి ప్రతి అవసరం తీర్చే వస్తువుగా మొబైల్ మారిపోయింది. అలాంటి ఫోన్ ఎక్కడైనా మిస్ అయితే ఇదివరకు పెద్దగా ఆందోళన చెందేవారు కాదు. కానీ ఇప్పుడు ఆర్ధిక లావాదేవీలతోపాటు బ్యాంకింగ్ కు సంబంధించిన సమాచారమంతా మొబైల్ లోనే నిక్షిప్తమై ఉంటుంది. అందుకే మొబైల్ ఎక్కడైనా పోయినా..? ఎవరినా దొంగిలించినా ఇట్టే ఆందోళనకు గురి అవుతున్నారు. స్మార్ట్ఫోన్ ఎక్కడైనా మిస్ అయిన.. ఎవరైనా దొంగిలిస్తే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
మొబైల్ మిస్ అయితే మొదట ఆందోళన చెందటం మానేయండి. సీఈఐఆర్ ద్వారా దాన్ని ట్రాక్ చేసి తిరిగి ఫోన్ దక్కించుకోవచ్చునని తెలుసుకోండి. మొబైల్ చోరీలపై ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో ఈ అంశంపై పోలీసులు ప్రత్యేక అవహగన కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన CEIR అనే అప్లికేషన్ ద్వారా సెల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా వెతికి పట్టుకోవడానికి ఈ పోర్టల్ ఉపయుక్తంగా ఉంటుంది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు చెప్తున్నారు.
పోయినా ఫోన్లను వెతికిపెట్టడానికి పొలిసు యంత్రాంగం సాంకేతిక అంశాల సహాయంతో ఫోన్ ఎక్కడుంది..? అనే సమాచారాన్ని గుర్తించడానికి వీలు అవుతుంది. ఇందుకోసం ఫోన్లు పోయిన వారు మొదట ఏం చేయాలో చూడండి. www.ceir.gov.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్ / స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేసిన అనంతరం పోయిన మొబైల్ నెంబర్లు, ఐఎంఈఐ నెంబర్లు, కంపెనీ పేరు, మోడల్,కొన్న బిల్లు పొందుపరచాలి. మొబైల్ ఎప్పుడు పోయింది.? అది జిల్లా, ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తుందనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఫోన్లు వాడే వారు ఎప్పుడు తమ ఫోన్ ఐఎంఈఐ నెంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు సమాచారాన్ని ఇంట్లో భద్రపరుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఫోన్ దొంగలించబడినా… ఎక్కడైనా మిస్ అయినా ఫిర్యాదు చేసే సమయంలో ఈ సమాచారాన్ని తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొబైల్ యూజ్ చేసే వారందరూ ఈ విషయాలను గుర్తుంచుకోండి.