ఏప్రిల్ 14. ప్రపంచ జ్ఞానశిఖరం అంబేడ్కర్ జయంతి. దేశానికి తన మేధోసంపత్తి ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించిన మేధావి అంబేడ్కర్. రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులపాటు రాజ్యాంగ రచన కోసం శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ జయంతి నేడు. ప్రపంచమంతా భారతీయులకు రాజ్యాంగం రాసుకునే సత్తా లేదని హేళన చేసినప్పుడు రాజ్యాంగ రచన బాధ్యతను తాను తీసుకున్నాడు. అహోరాత్రులు శ్రమించి అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి తనను ఛీకొట్టిన దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించాడు. ఎంతోమందికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. భారతదేశ అస్తిత్వం ఉన్నంతకాలం అంబేడ్కర్ చరిత సజీవంగా ఉంటుంది. రాజ్యాంగం లేని దేశాన్ని ఊహించుకోవడం ఎంత ఆందోళనకరమో అంబేడ్కర్ లేని భారతాన్ని ఊహించుకోవడం అంతే ఆందోళనకరం. కనిపించని శక్తులేవో నడిపిస్తే నడిచిన మనుషులం మనం అంటాడు శ్రీశ్రీ. ఈవాళ భారతదేశం అనుభవిస్తోన్న ఈ స్వేఛ్చ, స్వాతంత్ర్యాల వెనక అంబేడ్కర్ త్యాగమున్నది. పోరాటమున్నది. ఆయన జీవితం ఉన్నది. కానీ ఆ మహనీయుడి త్యాగాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టబడుతున్నాయి. ఆయన పోరాటాన్ని భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసే కుట్ర తెరవెనక జరుగుతోంది. అందులో పాలకులు తమ పాత్రను విజయవంతంగా పోషిస్తున్నారు.
అంబేడ్కర్ నేపథ్యం : అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన ‘మౌ’ ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మాలోజీ సాక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించాడు. నేటి మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లా వారి స్వస్థలం.ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతం త్య్రోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఆర్ధిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి. చిన్నతనంలోనే కుల వివక్షను అనుభవించడం వలన ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. అందుకే దేశంలోని కోట్లాది మందికి ఈ కుల వివక్ష నుంచి విముక్తి కల్గించాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకు ఏకైక మార్గం చదువేనని.. విద్యాభ్యాసంపై పూర్తిగా దృష్టిసారించాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా, సహా విద్యార్థులు గేలి చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తన చదువు దళితుల జీవితాల్లో వెలుగులు పూయించాలని నిర్ణయించుకున్నాడుఅంబేడ్కర్..
అంబేడ్కర్ విద్యాభ్యాసం : బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎం.ఏ., 1916లో పి.హెచ్.డి. పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత “ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమయ్యింది. 1917లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు. అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది. మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు. కాని కార్యాలయములో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు. కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ ‘మూక నాయక్’ అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్‌ని పైచదువుల కొఱకు విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు.
గాంధీతో అంబేద్కర్ కు బేధాభిప్రాయాలు : సైమన్ కమిషన్ అందించిన నివేదికపై చర్చించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలు 1930, 1931,1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేడ్కర్ హాజరు కాగ… రెండో సమావేశానికి జాతీయ కాంగ్రెస్ తరుఫున గాంధీ హాజరయ్యాడు. ఈ సమావేశాములోనే గాంధీకి అంబేద్కర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టాడు. అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. అయితే అంబేడ్కర్ డిమాండ్ చేసినట్లుగా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రకటన సమయంలో ఎరవాడ జైల్లో ఉన్న గాంధీ.. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రకటనను నిరసిస్తూ దీక్ష చేపట్టాడు. అంబేద్కర్‌పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్‌కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.
అందర్నీ కంటతడిపెట్టించే బాబా సాహెబ్ వ్యాఖ్యలు
“నాకు రెండవ కొడుకు గంగాధర్ పుట్టాడు. చూడడానికి చాలా అందమైన వాడు. అతను అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు. వైద్యం కోసం అవసరమైన డబ్బులు లేవు. అతని అనారోగ్యంతో ఒక్కసారిగా నా మనసు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఊగిసలాటలో పడింది. తిరిగి నాకు ఇలా ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను ఉద్యోగం చేసేటట్లయితే 7కోట్ల అంటరానివాళ్ళ గతి ఏమవుతుంది. వాళ్ళు గంగాధర్ కంటే తీవ్రమైన అనారోగ్యం పాలయి ఉన్నారు. సరైన వైద్యం చేయించని కారణంగా ఆ పసిపిల్లవాడు రెండున్నర సంవత్సరాల అల్ప వయస్సులోనే చనిపోయాడు. వీధిలోని జనం వచ్చారు. అందరూ పిల్లవాడి మృతదేహాన్ని కప్పేందుకు కొత్త గుడ్డ తీసుకురమ్మన్నారు. గుడ్డ తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు. చివరికి నా ప్రియమైన భార్య తన చీర నుంచి ఒక ముక్క చించింది. ఆ చీర ముక్క ఆ పిల్లవాడి మృతదేహంపై కప్పి జనం స్మశానానికి తీసుకువెళ్లారు. తర్వాత భూమిలో మృతదేహాన్ని పాతిపెట్టారు. అలాంటిది నా ఆర్థిక పరిస్థితి. అలాంటి కఠినమైన కడు పేదరికపు రోజుల్ని నేను చూశాను. అలాంటి కఠినమైన అనుభవాలు ఏ నాయకుడికీ ఎదురు కాకూడదు. దేశంలోని కులవివక్షకు గురి అవుతున్న ప్రజలను చైతన్యం చేయాలని కుటుంబాన్ని సైతం నిర్లక్ష్యం చేశాడు.
అంబేద్కర్ పట్ల పార్టీల వైఖరి: అంబేద్కర్ ను కేంద్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ లు ఓట్లు కుమ్మరించే యంత్రంగా ట్రీట్ చేస్తున్నాయి. ఎందుకంటే కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తే ఏనాడూ పట్టించుకోలేదు. పైగా దేశాన్ని మతం పేరిట, కులాల పేరిట మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశం మధ్య విభజన రేఖలు గీస్తూ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ , ఆర్ ఎస్ ఎస్ నేతలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగం అమలు చేయాలంటున్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా ఏం తక్కువేం తినలేదు. ప్రస్తుత భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలంటూ బీజేపీకి కోరస్ ఇస్తోంది. సాక్షాత్తు కేసీఆర్ ప్రెస్ మీట్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వద్దని అన్నారంటే… భారత రాజ్యాంగంపై ఎన్ని కుట్రలు నడుస్తున్నాయో చేపోచ్చు.
అంబేద్కర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాడని గ్రహించడంలో భారత సమాజం విఫలం అవుతూనే ఉన్నది. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకు మేలు జరిగేలా అంబేడ్కర్ వెసులుబాటు కల్పించిన విషయాన్ని అర్థం చేసుకోకుండా అంబేడ్కర్ ను కులానికి, మతానికి చెందిన వ్యక్తిగా భారత ఆధిపత్య కుల సమాజం విజయవంతంగా ఓ ముద్ర వేసింది. ఫలితంగా అంబేడ్కర్ అందరివాడు కాకుండా కొందరివాడయ్యాడు. కానీ ప్రపంచం దృష్టిలో గొప్ప మేధావిగా విరాజిల్లుతున్నాడు. అందుకే అంబేడ్కర్ వాదులు పదేపదే చెప్పే మాట ఒకటే. మార్క్స్ ను అర్థం చేసుకున్న భారతదేశం సొంత వాడైన అంబేద్కర్ ను అంటరాని కులాలకు మేలు చేసిన వాడిగా ట్రీట్ చేస్తున్నాయి.