ఇల్లు అలకగానే పండగ అయిపోదని తెలిసిందే. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం పార్టీ పేరు మార్చగానే మాది జాతీయ పార్టీ అయిపోయిందని ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుంటున్న దశలో ఈసీ బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదని…రాష్ట్ర హోదా మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఏపీలో రాష్ట్ర శాఖను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కు అక్కడ రాష్ట్ర హోదా కూడా లేదు. అంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే అక్కడ బీఆర్ఎస్ కు కారు గుర్తు దక్కుతుందని ఖచ్చితంగా చెప్పలేం. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ కు కారు గుర్తు ఉంటుంది. జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో మిగతా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు కారు గుర్తు దక్కడం గగనమే. అక్కడి పరిస్థితులను బట్టి ఎన్నికల గుర్తులను ఈసీ ఖరారు చేస్తుంది.
ఇక ఇటీవలి ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన ఓట్లు, సీట్లను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఆ పార్టీల స్థితిగతుల్ని మార్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను ప్రకటించగా…ఇప్పటివరకు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొంది ఉన్న NCP, CPM,CPI, TMC పార్టీల జాతీయ హోదాను రద్దు చేసింది. జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు కావాల్సిన అర్హతలను పొందకపోవడంతో ఈ పార్టీల జాతీయ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ, టీడీపీ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. జనసేనకు మాత్రం రాష్ట్ర పార్టీ హోదా కూడా లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన రాష్ట్ర పార్టీ హోదా పొందేందుకు అవసరమైన ఓట్లు, సీట్లు ఏవి పొందలేదు. దీంతో ఆ పార్టీని ఎన్నికల సంఘం గుర్తించలేదు.
ఎన్నికల సంఘం నియామావళి ప్రకారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 6శాతం ఓటింగ్ పర్సంటేజ్ ఉండటంతోపాటు రెండు అసెంబ్లీ సీట్లను గెలుపొందాలి. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి కాని ఒకటే అసెంబ్లీ స్థానంలో గెలిచింది. కనీసం ఓ లోక్ సభ స్థానం నుంచి గెలిచినా జనసేనకు రాష్ట్ర పార్టీ హోదా దక్కేది. రెండు సీట్లు దక్కకపోయినా కనీసం ఎనిమిది శాతం ఓట్లు వచ్చినా ఈసీ గుర్తింపు దక్కేది. కానీ జనసేన సీట్లు దక్కించుకోలేదు.. ఓట్లు పొందలేదు. దాంతో ఆ పార్టీ ఇంకా ఆన్ రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచింది.
Also Read : నేను వైసీపీకి అమ్ముడుపోయానా..? రేణు దేశాయ్ సంచలన పోస్ట్