పార్లమెంట్ సభ్యుడి అనర్హత వేటుపై లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హత వేటును వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది రాహుల్ గాంధీ విషయంలో కాదు. లక్ష్యదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ విషయంలో.
మహ్మద్ ఫైజల్ పై 2016 జనవరి 5న హత్యాయత్నం కింద అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు కొనసాగుతుండగానే ఆయన 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ తరుఫున పోటీ చేసి గెలిచారు. ఆయనపై నమోదైన కేసు విషయంలో ఈ ఏడాది జనవరి 11న ఫైజల్ కు పదేళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తనకు విధించిన శిక్షపై కేరళ హైకోర్టులో ఫైజల్ అప్పీల్ చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఫైజల్ నిర్దోషి అని తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత వేటును వెనక్కి తీసుకోవాలని లోక్ సభ సెక్రటేరియట్ ను ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలను లోక్ సభ అమలు చేయలేదు. దాంతో లోక్ సభ సెక్రటేరియట్ నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఫైజల్.
సుప్రీంకోర్టులో ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుందన్న సమయంలో లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఫైజల్ పై అనర్హత వేటును వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. లక్ష్యదీప్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేళ….ఫైజల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తున్నట్లు లోక్ సభ ప్రకటించడం కాంగ్రెస్ శ్రేణులకు ఊరటనిస్తోంది. రాహుల్ గాంధీ విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ అప్పీల్ కు వెళ్తే పైకోర్టులో ఆయనకు ఊరట దక్కుతుందని అంచనా వేస్తున్నారు.