చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమైందో తెలుసుకొని సీపీఆర్ చేసేలోపే కన్నుమూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహ సడెన్ హార్ట్ ఎటాక్ లు సాధారణంగా మారిపోయాయి.
కోవిడ్ తరువాత ఎవరికీ వారు మళ్ళీ ఉద్యోగ జీవితంలో మునిగిపోయారు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి నిత్యం ప్రయాణించాల్సి వస్తుండటంతో శరీరం అలసటకు గురి అవుతోంది. ఒక్కోసారి ఇంటికి వెళ్ళడం ఆలస్యం అవుతోంది. కుటుంబ సభ్యులతో పలకరింపులు కూడా ఆన్ లైన్ లో జరుగుతోన్న పరిస్థితి. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలను ఇంట్లో చెప్పుకునేందుకు సమయం కూడా ఉండటం లేదు. ఆసుపత్రులకు వెళ్ళే టైం కూడా ఉండటం లేదు. ఒత్తిళ్ళతోనే నిత్యం సావాసం చేయాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు మనుషుల జీవితాలను కత్తిరిస్తున్నాయి. ఇటీవల థాయ్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి మరణవార్త ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. న్యూస్ నెట్ వర్క్ లో పని చేస్తోన్న 44ఏళ్ల వ్యక్తి ఓవర్ వర్క్ చేయడంతో కన్నుమూశాడు. వారం మొత్తం పని చేస్తూ.. ఎక్కువ సమయం పని చేయడం వలన అతని శరీరం అలసటకు గురై చావుకు దగ్గరైంది.
ఆసియా దేశాలు ఎక్కువ పని గంటలకు పేరొందాయి. ఎక్కువ గంటలు పని చేయడం వలన ఇక్కడ మరణాలు చోటు చేసుకోవడం సర్వసాధారణంగా మారాయి. పని చేసే వ్యక్తులను బాస్ లు ప్రశంసించడంతో వారు పొంగిపోతారు. ఆ క్రమంలోనే ఎక్కువ సమయం ఉద్యోగ జీవితానికి వెచ్చించి అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఉద్యోగ సంస్థలకు ఉద్యోగుల ఆరోగ్యాలతో పని లేదు. వర్క్ చేయించుకోవడం వారి హక్కు. అందుకోసం ఏమైనా మాట్లాడుతారు. ఏమైనా ఆఫర్ చేస్తారు. కాని ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఉద్యోగులే. ఈ విషయాన్ని ఉద్యోగులు కొంతమంది మర్చిపోతున్నారు. ప్రశంసల కోసం, సంస్థ కోసం ఎక్కువ ఆశించి పని చేస్తూ అయిన వారికీ కడుపుకోతను మిగుల్చుతున్నారు.
డెస్క్ జర్నలిస్టులు ఎక్కువ సమయం సీట్లోనే కూర్చువాల్సి ఉంటుంది. బ్రేకింగ్ ఐటెం అని, ఇంకో వార్త అని ఉదయం వచ్చింది మొదలు లంచ్ వరకు సీట్లో నుంచి అసలు కదలరు. ఆ తరువాత సీట్లో కూర్చున్నాక సాయంత్రం ఇంటికి వెళ్ళేవరకు మళ్ళీ కదలరు. అలాచేయడం వలన కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి. అదే సమయంలో గుండెజబ్బులు కూడా వస్తాయి. కూర్చొని పని చేసే ఏ ఉద్యోగమైనా అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది.కాబట్టి.. మధ్యలో బ్రేక్ ఇవ్వడం మంచిది. అటు , ఇటు నడవడం మరీ మంచిది. ఇక పని ఒత్తిడి వలన బీపీ ,కొలెస్ట్రాల్ ను ఆహ్వానిస్తున్నాం. మీకు గుర్తుందా.. బాస్ ఫోన్ చేస్తే ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాం. సీట్లో కూర్చున్న మనం ఒక్కసారిగా లేచి నిలబడిపోతాం.ఆ ఒత్తిడి, ఆ ఫీలింగే మనల్ని క్రమంగా అనారోగ్యానికి దగ్గర చేస్తుంటుంది. 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టడీలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
2016లో ఎక్కువ పని చేసిన 50లక్షల మందిలో 7 , 45,000 మరణించారట. 2000-16మధ్య అధిక పని కారణంగా గుండె జబ్బుల మరణాలు 42శాతం పెరిగినట్లు తేల్చింది. స్ట్రోక్స్ అయితే 19శాతం పెరిగాయి. వారంలో 55అంతకన్నా ఎక్కువ పని చేసిన వారిలో స్ట్రోక్స్ లక్షణాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది 30నుంచి 40గంటలు పని చేసే వారికంటే 35శాతం ఎక్కువ. ఇక వీళ్ళలో గుండెజబ్బులు 17శాతం పెరిగాయి. ప్రపంచమంతా ఇదే పని చేస్తుందని అనుకుంటున్నారా.. కేవలం ఆసియా దేశాల్లోనే ఓవర్ వర్క్, అధిక పని గంటలు ఉంటున్నాయి.
యూఎస్ లో 5శాతం మందే ఎక్కువ గంటలు పని చేస్తారు. బ్రెజిల్ , కెనడాలోనూ అంతే. యూరప్ లో ఓవర్ వర్క్ అసలే చేయరు. యూఎస్ లో సాధారణ పని గంటలు వారానికి 37గంటలు , యూకే, ఇజ్రాయెల్ లో 36గంటలే. అదే భారత దేశంలో 48గంటలు. చైనాలో 46 గంటలే పని చేస్తారట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. మరి..ఓవర్ వర్క్ నుంచి మనమేం చేయాలి..?ఆఫీసులో చిన్న, చిన్న బ్రేక్ లు తీసుకోవాలి. బ్లడ్ సర్క్యూలేషన్ కోసం అటు, ఇటు నడవడం. ఏదైనా వర్క్ కోసం ఒత్తిడి చేసినప్పుడు మీ వల్ల కాకపోతే…నా వల్ల కాదని మొహమాట పడకుండా చెప్పేయండి. అంతేకాని రిస్క్ తీసుకొని ఒత్తిడితో అనారోగ్యానికి గురి కాకండి.