లక్షలోపు రుణమాఫీ కోసం.. 34లక్షల మంది రైతన్నల ఎదురుచూపులు.
• ఆగమ్యగోచరంగా అన్నదాతల పరిస్థితి
• బడ్జెట్ రూ. కోట్లు కేటాయిస్తున్నా.. విడుదలలో తీవ్ర జాప్యం
• రుణాలు చెల్లించాలని రైతులపై బ్యాంకర్ల వత్తిడి
ఉన్నమాట: “వడ్డీ.. వడ్డీ.. పెరిగి రైతుల నడ్డి విరుగుతోంది కానీ రైతు రుణాలు మాత్రం మాఫీ కావడం లేదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలకు వేల కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నా.. నిధులు మాత్రం పైసా కూడా విడుదల చేయ్యడం లేదు. రుణమాఫీ సకాలంలో అమలు కాకపోవడంతో రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది..
రైతురుణాల మాఫీ కోసం ప్రభుత్వం ఈ మూడేండ్లలో 17 వేల కోట్లు కేటాయిస్తే.. రూ.3వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీనిలో తొలిసారి రూ.400 కోట్లు, రెండోసారి రూ. 300 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాలోకే చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా.. రూ.25 వేల లోపు 2.96 లక్షల మంది రైతులకు, రూ.50 వేల లోపు 4.52 లక్షల -మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది
ప్రభుత్వం లక్షలోపు రుణాల మాఫీ ప్రకటన నేటికి కేవలం ప్రకటనగానే మిగిలిందని చెప్పాలి. నేటి వరకు ఒక్క రైతుకు కూడా పూర్తి గా లక్ష రూపాయలు రుణమాఫీ జరుగలేదు. ప్రభుత్వం రుణమాఫీ చెల్లిస్తుంది కదా అని రైతులు ఏండ్లుగా ఎదురుచూస్తూ ఉండటంతో వడ్డీకి వడ్డీ పెరిగి రైతుల నడ్డి విరిగినంత పని అయిందని చెప్పొచ్చు. ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల దృష్టిలో మొండి బకాయిదారులుగా మారారు. దీంతో మళ్లీ రుణాలు తీసుకునేందుకు వారంతా అవకాశం కోల్పోయారనే ప్రచారం జరుగుతుంది..
34 లక్షల మంది రైతులు ఎదురు చూపులు…
సుమారు రూ.34 లక్షల మంది రైతులు తమ బ్యాంకు రుణం ఎప్పుడు మాఫీ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం నుంచి రాకపోవడంతో… రైతులకు వచ్చిన రైతుబంధు పైసలు, ధాన్యం అమ్మిన సొమ్మును పలు బ్యాంకర్లు అప్పులు, వడ్డీ కిందికి జమ చేసుకుంటున్నారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. మూడేండ్ల నుంచి రైతుల పంట రుణాలు కూడా సక్రమంగా అందలేదు.
అప్పులు చెల్లించని, కనీసం లోన్లను రెన్యువల్ చేయని రైతుల అకౌంట్లను బ్యాంకులు మొండి బకాయిలుదారుల జాబితాలో పెడుతుండటంతో కిందటి మార్చిలో బ్యాంకులు ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్లో చాలా మంది రైతులు అప్పులు చేసి కొంత వరకు చెల్లించి రుణాలను క్లియర్ చేసుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.