కొడుకు చదువుకో, కూతురు పెండ్లికో అవసరానికి వస్తాయని రూపాయి రూపాయి కూడబెడతారు పేద, మధ్య తరగతి ప్రజలు. వాటిపై వడ్డీ వస్తే ఎంతో కొంత లాభం ఉంటుందని బ్యాంకుల్లో దాచుకుంటారు. కానీ కొందరు కో-ఆపరేటివ్ సొసైటీల పేరిట అధిక వడ్డీల ఆశజూపి ప్రజల నుంచి పెద్ద మొత్తం డబ్బులు తమ సంస్థల్లో పొదుపు చేయిస్తారు. కొంత కాలం లాభాలను చూపి తమ లక్ష్యం నెరవేరగానే బోర్డు తిప్పేస్తారు. వేలాది మంది బాధితులకు కన్నీళ్లు మిగులుతాయి, కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము అక్రమార్కుల సొంతమవుతుంది. గుండెలను పిండేసే బాధాకరమైన ఇటువంటి ఘటనలు జరగడం మనం తరచూ వార్తలో చూస్తుంటాము. మన కాకినాడ జిల్లాలో కూడా ఇలాంటి ఓ దుర్మార్గమైన ఘటన జరిగింది. బాధితుల కోట్లాది రూపాయల సొమ్ము మంది పాలైంది. అందులో ఓ ఎమ్మెల్యే తన వాటాను కూడా పొందారు. అవును ఓ ఎమ్మెల్యేకు ఆ స్కాంలో వాటాలందాయనే ఆరోపణలున్నాయి. అందుకే నేటి వరకు కూడా బాధితులకు న్యాయం జరగడం లేదు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, పోలీసు స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నా వారి వేదనను తీర్చేవారు కనిపించడం లేదు. వారి ఆక్రందనలు వినేవారు కరువయ్యారు.
ఆ స్కాం పేరే జయ లక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ స్కాం. రూ.520కోట్లకు పైగా జనం సొమ్మును దోచేశారు. బ్యాంకులో డబ్బులు పెట్టుకున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్నారు. కాకినాడ కేంద్రంగా 28 బ్రాంచీలను నిర్వహించి దోపిడీని చేశారు. అయితే చేసిన దోపిడీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సుమారు రూ.50కోట్లు వాటా పంచుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే కన్నబాబు కనుసన్నల్లోనే స్కాం జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకొని వారికి కన్నీళ్లను మిగిల్చిన కుట్రకు అండదండలు ఈ వైకాపా ఎమ్మెల్యే కురసాల కన్నబాబువేనని ప్రజలు చెబుతున్నారు. మరి ప్రజల సొమ్ము దోచే ఇటువంటి కేడీ ఎమ్మెల్యేలు మన కాకినాడకు జిల్లాకు అవసరమా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.