వైసీపీ ఎమెల్యేలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. వైసీపీ పాలన ఏమాత్రం బాగోలేదని ఓపెన్ గానే ప్రకటిస్తున్నారు. ఆ మధ్య ఆనం రాంనారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీ పాలనపై పెదవి విరిస్తే వారంతా టీడీపీ డైరక్షన్ లో ఈ విమర్శలు చేస్తున్నారని చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే జగన్ పాలన ఏమంత ఆశాజనకంగా లేదనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం చర్చనీయంశం అవుతోంది.
ఉమ్మడి కర్నూల్ జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఆయన ఎలాంటి ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేశారో కానీ వైసీపీలో అగ్గి పుట్టించినట్లు ఉన్నాయి. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉన్న మాట నిజమేనని దీనికి జగన్ కు అనుభవం లేకపోవడమే కారణమని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలతో ఎలా సఖ్యతగా మెలగాలన్న దానిపై జగన్ కు ఎక్స్ పిరియన్స్ లేకపోవడంతోనే ఎమ్మెల్యేలకు – ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ వస్తోందని చెప్పారు. రెండోసారి సీఎంగా అవకాశమిస్తే జగన్‌కు పూర్తి అవగాహన వస్తుందని సాయి ప్రసాద్ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
వైసీపీ పాలనపై తీవ్ర అగహవేశాలు వ్యక్తం అవుతోన్న వేళ జగన్ కు అనుభవం లేదని వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే జగన్ మొదటి దఫా పాలన బాగోలేదని చెప్పకనే చెబుతున్నాయి సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు. ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉండటానికి కారణం.. నియోజకవర్గ సమస్యలు వినేందుకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం.. నియోజకవర్గాలకు నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతోనే ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడుకట్టుకుంది. ఇదే సాయి ప్రసాద్ రెడ్డి పరోక్షంగా చెప్పినట్లు ఉంది. అయితే ఆయన చేసిన కామెంట్స్ ద్వంద అర్థాలకు దారితీస్తుందని అనుకున్నారేమో వెంటనే మరోసారి జగన్ కు రెండోసారి అవకాశం ఇస్తే అనుభవంతో పని చేసేందుకు వీలు ఉంటుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
అనుభవం లేకనే రాష్ట్రాన్ని కూడా నాశనం చేశారని ఇక మరో అవకాశం ప్రజలు ఎలా ఇస్తారనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. నాలుగేళ్ల పాలనలో ఎమ్మెల్యేలతో ఎలా ఉండాలో తెలుసుకోలేని జగన్ మరో అవకాశం ఇస్తే ఎలా నేర్చుకుంటారు..?అయినా ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎలా ఉండాలనేది అనుభవంతో వచ్చేది కాదు. మనస్తత్వం బట్టి వస్తుందని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేల అవసరం ఉన్నప్పుడు వారిని బాగా చూసుకుని అవసరం లేనప్పుడు కనీసం పట్టించుకోని వ్యక్తిత్వాలకు అనుభవంతో ఏం పని ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.