ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రత్యేక హోదా నినాదం కూడా ఓ కారణం. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతున్నా ఇంతవరకు ప్రత్యేక హోదా సాధించలేదు. ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రజల్లోకి వెళ్తే స్పెషల్ స్టేటస్ ఏమైందని నిలదీస్తారు. సామాన్య ప్రజలకంటే ఎదో ఒకటి చెప్పి మేనేజ్ చేయగలరు. కానీ విద్యావంతులు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు.? పరువు పోతుంది. ఇది వైసీపీ ఎంపీల ఆందోళన. అందుకే వైసీపీ ఎంపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రత్యేక హోదా సాధించేందుకు మేము చేయాల్సిన ప్రయత్నమంతా చేశాం. పూర్తి ఏఫర్ట్స్ పెట్టాం. కానీ కేంద్రమే ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి తప్పించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. 25ఎంపీ సీట్లు మాకివ్వండి కేంద్రంలో అధికారంలో ఎవరున్నా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలను నమ్మించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సమయంలో చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా సాధించకపోవడంతో ఇది వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
అందుకే ప్రత్యేక హోదా వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడల్లా ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించడం కామన్ అయింది. అదేసమయంలో కేంద్రం కూడా నిర్మొహమాటంగా ఇవ్వబోమని చెప్పడం రొటీన్. తాజాగా మరోసారి అదే సమాధానం ఇచ్చింది. కానీ వైసీపీ ఎంపీలు నోరెత్తలేదు. రఘురామకృష్ణంరాజు విషయంలో పార్లమెంట్ లో అల్లరి, అల్లరి చేసిన వైసీపీ ఎంపీలు …రాష్ట్ర ప్రయోజనాల కోసం సభను స్తంభింపజేయకపోవడం విశేషం.
ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యయనమని ప్రజల్ని మానసికంగా సిద్దం పని చేసే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. అందుకే స్పెషల్ స్టేటస్ పై ప్రశ్నిస్తూ కేంద్రం చేత ప్రత్యేక హోదా రాదనీ చెప్పిస్తున్నారు. పైగా.. ఈ విషయంలో బీజేపీని ఎదురించి ముందుకు వెళ్లేందుకు స్కోప్ లేదని మాట్లాడుతున్నారు . సభలో బీజేపీకి మెజార్టీ ఉందని చెబుతున్నారు.
బీజేపీకి వైసీపీ అవసరమున్న సమయంలో వ్యక్తిగత అవసరాల కండిషన్స్ పెట్టారు. అప్పుడు ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదు. ఫలితంగా రాష్ట్రం అన్యాయమైపోయింది. హోదా పోయింది. ఇంకా చెప్పాలంటే.. తము హోదాను లైవ్ లో ఉంచుతున్నామని చెబుతూంటారు. సజీవంగా ఉందంటే అది మా గొప్పే అంటూంటారు. కారణం ఏదైనా హోదా విషయంలో ప్రజల్ని అత్యంత దారుణంగా మోసం చేసిన ముద్ర మాత్రం వైసీపీపై పడిపోయింది.