ఒంగోలులో మహానాడు నిర్వహించే సమయంలో అద్దె బస్సుల కోసం ఆర్టీసీని సంప్రదించింది టీడీపీ. కాని ఒక్క బస్సు కూడా కేటాయించలేదు. పైగా.. రవాణా శాఖ అధికారులు మహానాడుకు వెళ్ళకుండా ప్రైవేట్ వాహనాలను కట్టడి చేశారు. చేసేదేమీ లేక టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులంతా వ్యక్తిగత వాహనాలపైనే మహానాడుకు వెళ్ళారు.
మహానాడు నిర్వహణ సమయంలో పండగలు.. ప్రత్యేక ఈవెంట్లు కూడా ఏమి లేవు. అయినా ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించలేదు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ ఖమ్మం సభకు వందల బస్సులను కేటాయిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి వందలాది బస్సులను ఏర్పాటు చేశారు. జనాన్ని తరలిస్తున్నారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సహకరించడం విశేషం.
సంక్రాంతి పండగకు వెళ్ళిన వారంతా తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. వారికీ బస్సుల అవసరముంది. అయినప్పటికీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా సిద్ధపడి..బీఆర్ఎస్ సభకు బస్సుల్ని కేటాయించారు. నాడు మహానాడుకు బస్సుల కేటాయింపునకు అబ్జెక్షన్ చెప్పిన ఆర్టీసీ అధికారులు.. ఇప్పుడు బీఆర్ఎస్ సభకు మాత్రం ప్రయాణికులను ఇబ్బంది పెట్టేందుకు కూడా సిద్దపడటం గమనార్హం.
ఏపీలో బీఆర్ఎస్ కు వైసీపీ సపోర్టుగా ఉంటుందని తాజా పరిణామాలతో అర్థం అవుతోంది. జాతీయ స్థాయిలో అవసరాల కోసం బీజేపీతో ఉన్నా ఎన్నికల తరవాత కేసీఆర్ తోనే జగన్ వెళ్తారని.. అందుకే ఇలాంటి సహకారం అందిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు…ఏపీలో పవన్ కల్యాణ్ తో ఇబ్బంది ఉంటుందని ఆయన సామజిక వర్గం ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్ నేతల ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.